
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిచినందుకు అతని సొంతూరికి చెందిన గ్రామస్తులు మొక్కు చెల్లించున్నారు. గతంలో శంకర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా.. నాలుగోసారి గెలిస్తే తలనీలాలు ఇస్తామని జైనథ్ మండలం అడా గ్రామస్తులు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కారు.
ఎమ్మెల్యేగా శంకర్ గెలవడంతో గ్రామానికి చెందిన150 మంది తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం ఎమ్మెల్యే శంకర్‌ను హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిశారు. తన గెలుపులో అడా గ్రామ ప్రజల పాత్ర ఎంతో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన జీవితకాలం గ్రామస్తులకు, ఆదిలాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. శంకర్ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారని గ్రామస్తులు పేర్కొన్నారు.