న్యూఢిల్లీ: లంచం ఆరోపణల గురించి దర్యాప్తుపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని అదానీ గ్రూప్ కంపెనీలు తెలిపాయి. అయితే ఒక థర్డ్‌పార్టీ అమెరికన్ అవినీతి నిరోధక చట్టాల ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తమకు తెలుసని అదానీ గ్రీన్ ఎనర్జీ పేర్కొంది.
యూఎస్ ప్రాసిక్యూటర్లు అదానీ గ్రూప్‌పై తమ దర్యాప్తును విస్తృతం చేశారన్న మీడియా రిపోర్టులపై అదానీ గ్రూపు స్పందించింది. సంబంధిత థర్డ్‌పార్టీతో తమకు సంబంధాలు లేవని తెలిపింది. లిస్టెడ్ అదానీ కంపెనీలు -- అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ విల్మార్ లిమిటెడ్, ఎన్డీ టీవీలు యూఎస్ అధికారుల నుంచి తమకు ఎటువంటి నోటీసులు అందలేదని వేర్వేరు ఫైలింగ్‌లలో పేర్కొన్నాయి. భారత్‌లో ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం లంచం ఆరోపణలపై అమెరికాలో దర్యాప్తు జరుగుతున్నట్టు బ్లూమ్బర్గ్వార్తాసంస్థ తెలిపింది.
