కొత్త వ్యాపారంలోకి అదానీ ఎంట్రీ.. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్..

కొత్త వ్యాపారంలోకి అదానీ ఎంట్రీ.. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్..

భారత్ క్లీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆదానీ గ్రూప్ మరో చరిత్రాత్మక ప్రాజెక్ట్ ప్రారంభించబోతోంది. గుజరాత్‌లోని ఖవడా ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌(BESS) ను నిర్మించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మొత్తం 1126 మెగావాట్ల సామర్థ్యంతో.. 3530 మెగావాట్‌ అవర్‌ ఎనర్జీ స్టోరేజీ కెపాసిటీ కలిగిన ఈ ప్రాజెక్ట్‌ 2026 మార్చి నాటికి ప్రారంభమవనుందని తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ట్రాన్స్ మిషన్ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్ బ్యాటరీ స్టోరేజ్ వ్యాపారంలో అడుగు పెట్టినట్లయింది. 

దేశంలో ఇప్పటివరకు ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ స్టోరేజీ ప్రాజెక్టు ఎక్కడా లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుంది. 700 కంటైనర్‌ ఆధారిత బ్యాటరీ యూనిట్లతో రూపుదిద్దుకునే ఈ వ్యవస్థ 3 గంటలపాటు 1126 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. 

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా విద్యుత్ డిమాండ్‌ను సమతుల్యం చేయడం, గ్రిడ్‌ స్థిరత్వాన్ని పెంచడం, ట్రాన్స్‌మిషన్‌ రద్దీని తగ్గించడం, రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగాన్ని గరిష్ఠం చేయడం సాధ్యమవుతుందని ఆదానీ గ్రూప్‌ చెప్పింది. అత్యాధునిక లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీతో పాటు అధునాతన ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ను కూడా ఇందులో జోడిస్తోంది కంపెనీ. 

ఎనర్జీ స్టోరేజీ అంటేనే రెన్యూవబుల్ ఎనర్జీ భవిష్యత్తు గుండె చప్పుడుగా గౌతమ్‌ ఆదానీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తాము ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా, భారతదేశ ఎనర్జీ స్వావలంబన, సుస్థిరత దిశలో కీలకమైన అడుగు వేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. 2027 ఆర్థిక సంవత్సరానికి 15 గిగావాట్‌ అవర్‌ బ్యాటరీ నిల్వ సామర్థ్యం సృష్టి.. ఐదేళ్లలో 50 గిగావాట్‌ అవర్‌ లక్ష్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అదానీ వెల్లడించారు.