న్యూఢిల్లీ: అదానీ కంపెనీల షేర్లు బుధవారం దూసుకుపోయాయి. గ్రూప్ మార్కెట్ క్యాప్ ఒక్క రోజులోనే రూ.48,550 కోట్లు పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ వంటి కీలక కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ మెప్పించడంతో షేర్లు ర్యాలీ చేశాయి. అదానీ గ్రీన్ షేర్లు బుధవారం 14శాతం పెరిగి రూ.1,145కి చేరాయి. కంపెనీ లాభం క్యూ2లో ఏడాది లెక్కన 111శాతం పెరిగి రూ.583 కోట్లకు పెరగడమే కారణం.
కంపెనీ ఆదాయం 20శాతం పెరిగింది. ఖవ్డా(రాజస్థాన్) లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అదానీ గ్రీన్ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఈ కంపెనీ 16.7 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ సామర్ధ్యాన్ని నిర్వహిస్తోంది.
మరోవైపు అదానీ టోటల్ గ్యాస్ షేర్లు బుధవారం 8.7శాతం పెరిగి రూ.675కి చేరుకున్నాయి. ఈ కంపెనీ లాభం క్యూ2లో ఏడాది లెక్కన 9శాతం తగ్గినా, సీఎన్‌జీ, పీఎన్‌జీ విభాగాల్లో సేల్స్ పెరగడంతో షేర్లు దూసుకుపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3.14 శాతం, అదానీ పవర్ 2.51శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 5.22శాతం, అదానీ పోర్ట్స్ 2.83 శాతం పెరిగాయి.
