రూ.21 వేల కోట్లు సేకరించనున్న అదానీ గ్రూప్​

రూ.21 వేల కోట్లు సేకరించనున్న అదానీ గ్రూప్​

న్యూఢిల్లీ: రెండు గ్రూప్​ కంపెనీల్లో షేర్ల అమ్మకం​ ద్వారా రూ.21 వేల కోట్లు (2.5 బిలియన్​ డాలర్లకుపైగా) సేకరించాలని అదానీ గ్రూప్​ నిర్ణయించింది. గ్రూప్‌‌‌‌‌‌కు చెందిన ఫ్లాగ్‌‌‌‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.12,500 కోట్లు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌‌‌‌మిషన్ కంపెనీ అదానీ ట్రాన్స్‌‌‌‌మిషన్ మరో రూ.8,500 కోట్లు సమీకరిస్తాయని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌‌‌లలో తెలిపాయి. రెన్యువబుల్​ ఎనర్జీ విభాగం, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డు కూడా నిధుల సేకరణ కోసం శనివారం సమావేశం కావాల్సి ఉండగా, ఇది ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది.

అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ జరుగుతుంది. యూరప్​, మిడిల్​ఈస్ట్ దేశాల పెట్టుబడిదారులు షేర్ల కొనుగోలుకు ఆసక్తితో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపాయి ఫేస్​వాల్యూ కలిగిన షేర్లు/సెక్యూరిటీలు లేదా రెండింటి అమ్మకం ద్వారా రూ.12,500 కోట్లు సేకరిస్తామని అదానీ ఎంటర్​ప్రైజ్​ ప్రకటించింది. తాము రూ.పది ఫేస్​వాల్యూ కలిగిన షేర్లు/సెక్యూరిటీలు లేదా రెండింటి అమ్మకం ద్వారా రూ.8,500 కోట్లు రాబడతామని అదానీ ట్రాన్స్​మిషన్​ వెల్లడించింది. క్విప్​లేదా ఇతర విధానాల ద్వారా నిధులు తీసుకుంటామని తెలిపింది.