రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు

రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు

రన్ టైమ్ : 2 గంటల 30 నిమిషాలు
నటీనటులు: శర్వానంద్, రష్మిక, ఖుష్బూ, రాధిక, ఊర్వశి, ఝాన్సీ, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్
మ్యూజిక్ : దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత : చెరుకూరి సుధాకర్
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
రిలీజ్ డేట్ : మార్చి 4,2022

 

శర్వానంద్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ
చిరంజీవి (శర్వానంద్) కు నలుగురు అమ్మలు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుతారు. తనకు సంబంధించి ఏ పనైనా వాళ్లే చూసుకుంటారు. అందుకే వాళ్లకు నచ్చకుండా ఏ పని చేయడు. పెళ్లి విషయంలో కూడా అంతే. అందరికీ నచ్చితేనే సంబంధం ఓకే చేస్తాడు. కానీ వాళ్లకు ఏ అమ్మాయి నచ్చదు. సడన్ గా ఆద్య (రష్మిక) పరిచయమవుతుంది. ఇద్దరికీ ఇష్టం ఉన్నా.. ఆద్య వాళ్ల అమ్మకు పెళ్లంటే మంచి అభిప్రాయం ఉండదు. అందుకే తనను ఒప్పించటానికి చిరంజీవి ఏమి చేశాడు? చివరికి ఏం జరిగింది? అనేది కథ.

పర్ఫార్మెన్స్:
శర్వానంద్ డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తనలోని ఫన్ సైడ్ ను ఈ సినిమాలో బాగా చూపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. రష్మిక చాలా అందంగా కనిపించింది. నటన తో కూడా ఆకట్టుకుంది. ఖుష్బూ కు మంచి పాత్ర దక్కింది. రాధిక,ఊర్వశి లు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. వెన్నెల కిషోర్, సత్య కాసేపు నవ్వించారు.

టెక్నికల్ వర్క్:
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. ఎక్కడో విన్నట్టు అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే. సుజిత్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ ,ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. కిషోర్ తిరుమల రాసుకున్న డైలాగులు ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ:
‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’’ నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా చూస్తున్నంత సేపు ఫర్వాలేదనిపిస్తుంది. కానీ ఇలాంటి కథ ఇదివరకు చాలా సార్లు చూసేసిందే కావడం ఈ మూవీ మైనస్.సేమ్ స్టోరీ సేమ్ ట్రీట్ మెంట్. డైరెక్టర్ కిషోర్ తిరుమల డైలాగుల వరకు బాగానే రాసుకున్నాడు కానీ కథ, కథనం మీద పెద్దగా కొత్తదనం చూపించలేదు. ఫస్టాఫ్ ఫన్ గా సాగిపోతుంది. సెకండాఫ్ వచ్చేసరికి ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. అందుకే సెకండాఫ్ లో చివరికి వచ్చేసరికి బోర్ కొడుతుంది. మెయిన్ ప్లాట్ రివీల్ చేసినప్పుడే అక్కడే సినిమా ఫినిష్ చేయాల్సింది. కానీ ఆ తర్వాత దర్శకుడు బాగా లాగాడు. దానికి తోడు ఓవర్ డ్రామా పండించాడు. దానివల్ల ముందు నుంచి సినిమా మీద ఉన్న ఇంప్రెషన్ పోయింది. దీంతో ఓ మామూలు సినిమా చూసినట్టు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల నటన ,డైలాగులు, కామెడీ వల్ల టైమ్ పాస్ అవుతుంది. కానీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చదు.

బాటమ్ లైన్: ఆడవాళ్లు మీకు..పాస్ మార్కులు.

మరిన్ని వార్తల కోసం:

‘భీమ్లా నాయక్’ హిందీ ట్రైలర్ రిలీజ్