
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరుగుతున్న అక్రమాలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే బాధ్య త వహించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఈ కేసులో కేటీఆర్ శిక్షార్హుడని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణను క్యాసినో హబ్‌గా కేటీఆర్ మార్చారని మండిపడ్డారు. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో, జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్‌లో నడుస్తున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన పర్మిషన్ తోనే గత రెండేండ్లుగా ఈ పందాలే జరుగుతున్నాయన్నారు. అలాంటి దొంగలకు కేటీఆర్ నాయకుడని అద్దంకి ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్‌ను లీజుకు ఇచ్చామని బుకాయిస్తున్నారని, దొంగలకు లీజుకు ఇస్తే, ఇచ్చిన వారు కూడా దొంగలే అవుతారని విమర్శించారు. గుజరాత్‌లోని సూరత్ పోర్టు నుంచి తెలుగు రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోందని ఆయన ఆరోపించారు.