కీసర, వెలుగు: కీసర పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హోంగార్డ్ నాగేశ్, గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డాక్టర్ సందీప్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గత ఏడాది అక్టోబర్ లో కీసరలోని నితిన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తోటకూర మహేశ్ యాదవ్ చనిపోయాడు. అప్పటి నుంచి మృతుడి మేనల్లుడు శరత్ యాదవ్ గాంధీ హాస్పిటల్, పోలీస్‌స్టేషన్ పీఎంవో రిపోర్ట్ కోసం తిరిగాడు.
ఈక్రమంలో హోంగార్డ్ నాగేశ్‌ను కలవగా, గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డాక్టర్ సందీప్ రూ.2 లక్షలు అడుగుతున్నాడని చెప్పాడు. శరత్ యాదవ్ చివరికి రూ.40 వేలు ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శనివారం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద డబ్బులు ఇవ్వగా, ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హోంగార్డు, డాక్టర్‌ను విచారణ అనంతరం వారిని రిమాండ్‌కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ పి శ్రీధర్ తెలిపారు.
