
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాను నిరక్షరాస్యులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య సూచించారు. నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, డీఈవో ఎస్.యాదయ్య, విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి చేయూత అందించాలన్నారు.
ప్రతి ఒక్కరూ అక్షరాస్యత కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో నిరక్షరాస్యతను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని 31,435 మంది నిరక్షరాస్యులను గుర్తించి వాలంటీర్ల ద్వారా చదువు చెప్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్, కమ్యూనిటీ మొబైల్ అధికారి చౌదరి, క్వాలిటీ కోఆర్డినేటర్స్ సత్యనారాయణమూర్తి, శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.