- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి
ఖమ్మం టౌన్, వెలుగు : వెట్ ల్యాండ్ పరిరక్షణతో పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం వెట్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ వెట్ ల్యాండ్ కమిటీ బాధ్యతలు, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కమిటీ సభ్యులకు వివరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ చిత్తడి భూముల సంరక్షణ కోసం 2017లో ప్రభుత్వం కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టిందన్నారు.
వెట్ ల్యాండ్ గుర్తింపు, సంరక్షణ కోసం జిల్లా వెట్ ల్యాండ్ కమిటీని కలెక్టర్ చైర్మన్ గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 11,468 వెట్ ల్యాండ్ లను గుర్తించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 467 వెట్ ల్యాండ్ లు 8,911 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు తేలిందన్నారు. చెరువులు, రిజర్వాయర్, కాల్వల ఫీడర్ చానెల్స్, మత్స్య శాఖ పరిధిలో ఉన్న ప్రణాళిక, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలో ఉన్న సమాచారం పరిగణలోకి తీసుకుంటూ జిల్లాలో ఉన్న చిత్తడి నేలలు ధ్రువీకరించాలని చెప్పారు. చిత్తడి నేలల్లో అనేక రకాల మొక్కలు, పక్షులు, జంతువులు ఆవాసాలను ఏర్పర్చుకుంటాయన్నారు.
తడి భూముల్లోకి కాల్వ సహజ ప్రవాహంలో మానవ జోక్యాన్ని గుర్తించాలని, తడి భూములను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందుకు జిల్లాలోని చింతకాని మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి చిత్తడి నేలలు గుర్తించి పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. నీటి వనరుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ సమీపంలో తడి భూములను గుర్తించాలని, వచ్చే మంగళవారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ డి. పుల్లయ్య, డీపీఓ ఆశాలత, జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఇర్రిగేషన్ అధికారి టి. వెంకట్రాం, డిప్యూటీ సీఈఓ కె. నాగపద్మజ, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, ఇర్రిగేషన్ ఈఈ అనన్య, మధిర, వైరా మున్సిపల్ కమిషనర్లు ఏ. సంపత్ కుమార్, యు. గురులింగం, ఖమ్మం నగరపాలక సంస్థ హార్టికల్చర్ అధికారిణి బి.. రాధిక, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను చేరుకోవాలి
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను చేరుకోవాలని అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఉద్యానవన, సహకార శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన అధికారుల శిక్షణ, అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో నష్టం సంభవించడానికి ఆస్కారం లేని పంట ఆయిల్ పామ్ అని తెలిపారు. ఈ పంట అధిక లాభాలను కూడా కలిగిస్తుందని తెలిపారు. 76 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఆయిల్ పామ్ పై పీఏసీఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సోమవారం పీఏసీఎస్ చైర్మన్ లతో మరో మారు సమావేశం నిర్వహించాలని, రాబోయే గురువారం నుంచి ఫీల్డ్ లెవల్ లో పని చేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు పని చేయకపోతే వాపస్ చేయాలని, టార్ఫాలిన్ కవర్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టుకోవాలని చెప్పారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, డీసీఓ గంగాధర్, సెరికల్చర్ డీడీముత్యాలు పాల్గొన్నారు
