- అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
వికారాబాద్, వెలుగు: జిల్లాలో నీటి సమస్య తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. డివిజన్, మండలస్థాయిలో గ్రామాల వారీగా బోర్ వెల్స్, చేతి పంపుల మరమ్మతులు ఎన్ని ఉన్నాయో, ఎంత ఖర్చవుతుందనే వివరాలను అందించాలని సూచించారు. మిషన్ భగీరథ, పంచాయతీ శాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై గురువారం తన చాంబర్ లో సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ సమ్మర్ లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోర్ వెల్స్ , చేతి పంపుల మరమ్మతులు చేపట్టాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టంచేశారు. ఎక్కడైనా పైపులైన్ లు పగిలిపోతే అధికారుల వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అలసత్వం వహించొద్దని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అవగాహన కల్పించాలని సూచించారు.
నీటి ఎద్దడి గ్రామాల్లో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకొని పంపిణీకి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు శ్రీనివాస్, డివిజనల్ పంచాయతీ అధికారులు సంధ్యారాణి, శంకర్ నాయక్, మిషన్ భగీరథ డీఈలు సుబ్రమణ్యం, రత్న ప్రసాద్, శశాంక్ మిశ్ర పాల్గొన్నారు.