
- త్వరలో అనుబంధ నోటిఫికేషన్
- ప్రస్తుత ఖాళీలు కలుపుకొంటే పెరిగే అవకాశం
- కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ
హైదరాబాద్: కొలువుల భర్తీపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెట్టింది. గ్రూప్–2,3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. గ్రూప్-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలని ప్రభుత్వ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 గ్రూప్-2 నోటిఫికేషన్‌లో కటాఫ్ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
2022 డిసెంబర్ 30న విడుదలైన గ్రూప్ -3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. తొలుత 1362 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1,375కు చేరింది. ఈ పోస్టులకు అదనపు ఖాళీలను కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రేపటి నుంచి గ్రూప్–1 దరఖాస్తులు గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది.