నేరడిగొండ, వెలుగు : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలం బొందిడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ ఇండ్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది పేదల ప్రభుత్వమని, అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అనంతరం మండలంలోని కుప్టీ గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన దూల భూమన్న ఇంటిని ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ సునీత, దర్భ తండా సర్పంచ్ సీతారాం, ఉపసర్పంచ్ విజయ్, బొందిడి మాజీ సర్పంచ్ జనార్దన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
