పశ్చిమ బెంగాల్‌లో 'అడెనో' వైరస్‌ కలకలం

పశ్చిమ బెంగాల్‌లో 'అడెనో' వైరస్‌ కలకలం

పశ్చిమ బెంగాల్ లో అడెనో వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా పశ్చిమ బెంగాల్లో 24 గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. వారంతా రెండేళ్లలోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది.  వైరస్ లక్షణాలతో ఉన్నావారి నమూనాలను పరీక్షల కోసం పంపామని, ఫలితాలు రావల్సివుందని వైద్య అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 అడెనో వైరస్ మరణాలు నమోదైయ్యాయని, వారిలో 8 మందికి పలు సమస్యలు ఉన్నాయిని ప్రభుత్వం తెలిపింది. 121 ఆస్పత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాలు 5 వేల పడకలను సిద్ధంగా ఉంచామని పేర్కొంది. రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్ఐ కేసులు నమోదైయ్యాయని వెల్లడించింది.

ఈ సీజన్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణమని.. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  రాష్ట్రంలో అడెనో వైరస్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో చర్చించి.. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వైద్య సిబ్బంది, ఇతర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అత్యవసర హెల్ప్‌లైన్ 1800–313444–222 నెంబర్లను ప్రకటించారు.

అడెనో వైరస్ సోకినా వారిలో తేలికపాటి జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు, న్యుమోనియా, కండ్లకలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులు దగ్గడం, తుమ్మడం, తాకడం వల్ల ఇది ఇతరులకు వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. అలాగే, మలమూత్రాల ద్వారా కూడా ఇది ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశముందని హెచ్చరించారు. 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఈ వైరస్‌ సంక్రమణకు ఎక్కువగా గురవుతారని..వీరికి ఇంట్లోనే చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా అడెనోవైరస్ పిల్లల్లో శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని తెలిపారు.

అడెనోవైరస్ సోకిన వారికి నిర్దిష్ట చికిత్సా విధానం, ఆమోదించిన యాంటీవైరల్ మందులు లేవని వైద్యులు అంటున్నారు. నొప్పి నివారణ మాత్రల ద్వారా తేలికపాటి లక్షణాలు తగ్గుతాయని వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని హెచ్చరిస్తున్నారు. ఎల్లప్పుడూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, పరిశుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. కావున మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. సాధారణ లక్షణాలే అని అజాగ్రత్త వహించకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.