ఆదిలాబాద్టౌన్, వెలుగు; జిల్లాలోని యువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక విశేషాలను ప్రపంచానికి చాటి చెప్పాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లాలోని పర్యాటక విశేషాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వినూత్నంగా నిర్వహించిన ‘99 డేస్ డిజిటల్ టూరిజం చాలెంజ్ - రీల్స్ కాంపిటీషన్’ గురువారంతో ముగిసింది.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యువ ఇన్ఫ్లుయెన్సర్ విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన టెక్నాలజీతో క్రియేటివిటీని జోడించి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, టూరిజం అధికారి రవికుమార్, డీపీఆర్‌వో విష్ణువర్ధన్, కళాకారులు పాల్గొన్నారు.
