- ఎకరానికి దిగుబడి 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే..
- తుది దశకు చేరుకున్న కొనుగోళ్లు
- యాసంగి పంటపైనే రైతుల ఆశలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతులు నిండా మునిగారు. దిగుబడులు నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం ఉన్న పత్తిని తీస్తే కూలీల ఖర్చులు కూడా రావని రెండో తీతకే పత్తిని పూర్తిగా తొలగిస్తున్నారు. సాధారణంగా పత్తిని మూడోసారి తీసేవరకు రైతులు ఉంచుతారు. కానీ ఈసారి అతి, అకాల వర్షాలతో పత్తి దిగుబడులు పడిపోయాయి. ఈ క్రమంలోనే పత్తి పంటను రెండో తీతకే తొలగిస్తూ యాసంగి కోసం సిద్ధమవుతున్నారు. వానాకాలం సాగులో పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. దీంతో యాసంగి సాగుపైన రైతులు ఆశలు పెట్టుకున్నారు.
సగం దిగుబడి కూడా రాలె..జిల్లా వ్యాప్తంగా 4.40 పత్తి పంట సాగు చేశారు.
30 లక్షలకు పైగా క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు మార్కెట్కు అమ్మకానికి ఇందులో సగం కూడా రాలేదు. జిల్లాలో 17 కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రస్తుతం పంట తీత తుది దశకు చేరుకోవడంతో కొనుగోళ్ల ప్రక్రియ సైతం ముగిసే అవకాశం ఉంది. 50 శాతం మంది రైతులకు ఎకరానికి కనీసం 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. పత్తి ఎదిగే దశలో సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు పూత, కాత రాలిపోయింది.
పంట నల్లబారిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. మొదట్లో అధిక వర్షాలు కురిసి వేళ వేల ఎకరాల్లో పత్తి నీట మునిగిపోగా, రెండో దశలో పూత సమయంలో వర్షాలు పడడంతో పంటపై రైతులు ఆశలు వదులుకున్నారు. ఎకరానికి రూ.30 వేలు వరకు ఖర్చు చేసిన రైతుకు మూడు, నాలుగు క్వింటాళ్లే దిగుబడి రావడంతో పెట్టుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే అధికారులు వేసిన అంచనాకు కనీసం సగం కూడా కొనుగోళ్లు జరగలేదు.
యాసంగికి సిద్ధమవుతున్న అన్నదాత
యాసంగికి అన్నదాత సిద్ధమవుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో అత్యధికంగా జొన్న పంట 1.09 లక్షల ఎకరాల్లో, శెనగ 36 వేలు, మొక్క జొన్న 15 వేలు, కంది 3 వేలు, ఇతర పంటలు 2 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇప్పటికే పంట పొలాలను చదును చేస్తున్న రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వానాకాలం సాగులో పత్తి, సోయా పంటల సాగుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు యాసంగి పంటపైనే ఆశలు పెట్టుకున్నారు.
జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు వివరాలు క్వింటాళ్లలో ..
ఎకరాలు 4.40 లక్షలు
దిగుబడి అంచనా 30 లక్షలు
ఇప్పటివరకు కొనుగోళ్లు 12.40 లక్షలు
సీసీఐ కొనుగోళ్లు 12 లక్షలు
ప్రైవేట్ కొనుగోళ్లు 40 వేలు
8 ఎకరాల్లో 25 క్వింటాళ్లే వచ్చింది
ఈసారి పత్తి పంట వేసి తీవ్రంగా నష్టపోయాం. 8 ఎకరాల్లో సాగు చేస్తే 25 క్వింటాళ్లే వచ్చింది. పత్తి కాయ దశలో వర్షాలు పడటంతో పంటపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా పెట్టుబడి కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. - రవి, బండల్ నాగాపూర్, ఆదిలాబాద్జిల్లా
