ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో.. ఆర్మీ జవాన్ కు పదేండ్ల జైలు శిక్ష

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో.. ఆర్మీ జవాన్ కు  పదేండ్ల జైలు శిక్ష

కాగ జ్ నగర్, వెలుగు: ప్రేమ పేరుతో యువతిని మోసగించిన కేసులో ఆర్మీ జవాన్ కు పదేండ్ల జైలు శిక్ష, రూ.35 వేల జరిమానా విధిస్తూ  ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ గురువారం తీర్పు ఇచ్చారు. కాగజ్ నగర్ రూరల్ సీఐ కుమారస్వామి తెలిపిన ప్రకారం.. కాగజ్ నగర్ మండలం ఈస్ గాం ట్రాక్టర్ షెడ్ ప్రాంతానికి చెందిన ఆర్మీ జవాన్ మోహనంద్ సర్కార్, అదే ప్రాంతానికి చెందిన యువతి (23)తో పరిచయం ఉండగా, ఆమె ఇంటికి వెళ్తూ కుటుంబ సభ్యులతో చనువుగా ఉండేవాడు. 2019 జూన్ లో సెలవుల్లో వచ్చిన అతడు మద్యం తాగి యువతి ఇంటికి వెళ్లాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు.

 బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో  పెద్ద మనుషుల్లో పంచాయితీ చేశారు. ఆమెను  పెండ్లి చేసుకోవడం ఇష్టంలేదని అతని కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. దీంతో బాధిత యువతి   ఈస్ గాం పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయగా కేసు నమోదైంది. కోర్టులో  వాదోపవాదనల్లో భాగంగా పీపీ జగన్మోహన్ రావు , లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, సీడీవో బాలాజీ   సాక్షులను హాజరు పరచగా, విచారించి నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం, రూరల్ సీఐ కుమారస్వామి, ఈస్ గాం ఎస్ఐ కళ్యాణ్, సిబ్బందిని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అభినందించారు.