ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడలే.. చెరువులు నిండలే

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడలే.. చెరువులు నిండలే

వానాకాలం రెండు నెలలు గడిచినా నిండని చెరువులు
జిల్లాలో లోటు వర్షపాతం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది సరైన వర్షాలు పడలేదు. వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా లోటు వర్షపాతమే నమోదైంది. ఈసారి కొంత ముందుగా, తర్వాత రెండు మూడు సార్లు వానలు పడినా ఆపై  ముఖం చాటేశాయి. పలుమార్లు పడిన వానలతో అక్కడక్కడ చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద చేరి కొంత మేర నీటి సామార్థ్యం పెరిగింది. 

కానీ ఇప్పటి వరకు భారీ వర్షాలు మాత్రం నమోదు కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో చెరువులు, ప్రాజెక్టులు నిండలేదు. జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 565.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 491.1 మి.మీ. మాత్రమే నమోదైంది. గతేడాది ఆగస్టు నాటికి సాధారణ వర్షపాతం నమోదు కాగా.. ఈసారి మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. 

ఆగస్టు, సెప్టెంబర్ పైనే ఆశలు

ముసురు వర్షాలకు ప్రాజెక్టులు, చెరువుల్లోకి ఇన్ ఫ్లో ఆశించిన స్థాయిలో రాకపోవడంతో చాలా చెరువులు 70 శాతం నుంచి 80 శాతం మాత్రమే నిండాయి. ముఖ్యంగా జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 286.50 మీటర్లకు గాను 285 మీటర్లు ఉంది మత్తడి వాగు  277.50 మీటర్లకు గాను 277 మీటర్ల మేర నీరు ఉంది. ఇప్పటికే చెరువులు అలుగు పారి.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటి విడుదల చేయాల్సి ఉండగా ఆ పరిస్థితి లేదు. 

జిల్లా వ్యాప్తంగా 280 చెరువులు ఉండగా దాదాపు 100 చెరువులు ఇంకా 80 శాతం కూడా నిండలేదు. భారీ వర్షాలు పడితేనే ప్రాజెక్టుల్లోని నీరు చేరి యాసంగి సాగుకు ఇబ్బందులు ఉండవని అన్నదాతలు చెబుతున్నారు. సాత్నాల కింద 24 వేల ఎకరాలు, మత్తడి వాగు కింద 8,500 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అటు చెరువుల ఆయకట్టు సైతం 20 వేల ఎకరాలకు పైగా ఉంటుంది. దీంతో వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ మాసాలపైనే రైతులు  ఆశలు పెట్టుకున్నారు.