ఆదిలాబాద్ జిల్లా.. అవార్డుల ఖిల్లా.. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న జిల్లా

ఆదిలాబాద్ జిల్లా.. అవార్డుల ఖిల్లా.. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న జిల్లా
  • దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న జిల్లా
  • పాలనలో తనదైన ముద్ర వేస్తున్న కలెక్టర్ రాజర్షి షా 
  • రాష్ట్రపతి, ప్రధాని చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాలు
  • ఇప్పటి వరకు పలు జాతీయ అవార్డులు కైవసం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లాగా పేరుంది. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది. అభివృద్ధిక కార్యక్రమాల్లో ఉత్తమ జిల్లాగా నిలుస్తూ అడవుల జిల్లా.. అవార్డుల ఖిల్లాగా మారుతోంది. అధికారులు జిల్లాలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తూ అభివృద్ధిలో ముందుంచుతున్నారు. వెనుకబాటు తనాన్ని చెరిపేస్తూ జిల్లాను ముందుకు నడిపిస్తున్నారు. కలెక్టర్ రాజర్షి షా తనదైన ముద్ర వేస్తూ జిల్లాను నంబర్ వన్​గా నిలుపుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర నిధులతో ప్రజలు, స్వచ్ఛంధ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ అందరి సహకారంతో ముందుకు నడుపుతున్నారు. ముఖ్యంగా నీతి అయోగ్ చేపట్టే జాతీయ స్థాయి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ జిల్లాను అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. దీంతో జిల్లాకు ఏడాది కాలంలోనే ఏడు జాతీయ అవార్డులు దక్కాయి.

టాప్ 5 బ్లాకుల్లో నార్నూర్

జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించేడమే కాకుండా.. సాంకేతికతను వినియోగించుకుని విద్య, వైద్య, వ్యవసాయాభివృద్ధిలో కలెక్టర్​తన మార్క్ చూపిస్తున్నారు. నీతి అయోగ్ అమలు చేస్తున్న ‘ఆస్పిరేషన్ బ్లాక్’ కార్యక్రమంలో నార్నూర్ ను ఉత్తమంగా నిలిపారు. సేంద్రియ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడం, జలవనరులను అభివృద్ధి చేయడం, చిన్నారులు, గర్భిణులు, మహిళల్లోని రక్తహీనతను దూరం చేసేందుకు పౌష్టికాహారం అందించడం, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు, పాఠశాల్లో ఆంగ్ల బోధన వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశారు. 

అత్యవసర వైద్య సేవలను మెరుగుపర్చారు. దీంతో నార్నూర్ బ్లాక్ గిరిజనాభివృద్ధి, మహిళ సాధికారత, సుస్థిర వ్యవసాయం, డిజిటల్ పరిపాలనలో నంబర్ వన్​గా నిలిచింది. జాతీయ స్థాయిలో టాప్ 5 బ్లాకుల్లో నార్నూర్ నిలిచింది. ఫలితంగా 2024లో ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా కలెక్టర్ అందుకున్నారు. 

జిల్లాకు వచ్చిన అవార్డులు ఇవీ..

రాష్ట్రపతి చేతుల మీదుగా.. జల సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జల్ సంచాయ్ జన్ భాగీధారి’ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సౌత్ జోన్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకుగాను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం న్యూఢిల్లీలోని విజ్క్షాన్ భవన్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పుర స్కారం అందుకున్నారు. 

ప్రధాని చేతుల మీదుగా.. అభివృద్ధిలో వంద శాతం సక్సెస్ సాధించిన నార్నూర్ మండలానికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్ రాజర్షి షా అవార్డు తీసుకున్నారు. ఈ అవార్డుతో పాటు రూ.20 లక్షల నగదు 

స్వీకరించారు. 

 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో ఈ ఏడాది 25న రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెకర్ట్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీస్ 2024 అవార్డును అందుకున్నారు. 
 
రాష్ట్రంలోనే తొలిసారిగా ఎక్కడ లేనివిధంగా జిల్లాలో ‘ఆరోగ్య పాఠశాల’ అనే వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. కార్యక్రమం విజయవంతం కావడంతో మార్చి 31న సివిల్ సర్వీస్ డే రోజు జాతీయ పురస్కారం  తీసుకున్నారు. 

 నార్నూర్ ఆస్పిరేషన్ బ్లాక్ లో విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అంశాల్లో పక్కగా అమలు చేసినందుకు గాను సెర్ప్ సంస్థ అందించే సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ రాష్ట్ర పురస్కారాన్ని ఆగస్టు 2న కలెక్టర్​రాజర్షి షాకు గవర్నర్ అందజేశారు. 

నీతి అయోగ్ కార్యక్రమాల అమల్లో జిల్లా జాతీయ స్థాయి పురస్కారాలు దక్కించుకుంది. ‘యూజ్ కేస్ చాలేంజ్-.. నీతి ఫర్ స్టేట్స్’ కార్యక్రమంలో భాగంగా విద్య, సామాజికాభివృద్ధి, ఆరోగ్యం, పోషణ విభాగాల్లో ప్రతి విభాగానికి రూ.లక్ష బహుమతి దక్కింది. ‘ఇంప్రూవ్ సాఫ్ట్ స్కిల్స్ ఎమాంగ్ స్టూడెంట్స్’ అనే యూజ్ కేస్ ఎడ్యుకేషన్ థీమ్ కింద ఆదిలాబాద్​జిల్లా జాతీయ విజేతగా నిలిచింది. రూ.2 లక్షల బహుమతి లభించింది.

జిల్లాలో ఆదికర్మయోగి, దర్తీ ఆబా జన్ భాగిదారీ అభియాన్​లో ఆదిలాబాద్​ను ఉత్తమ జిల్లాగా కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అక్టోబర్ 20న ప్రకటించింది. జిల్లాస్థాయిలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, కనెక్టివిటీ, ప్రజల భాగస్వామ్యం, స్థానిక వనరుల వినియోగం, గ్రామస్థాయిలో శిక్షణ సమర్థంగా అమలు చేసినందుకు గాను జాతీయ పురస్కారం దక్కింది.