పంట నష్టపరిహారంపైనే సోయా రైతుల ఆశలు

పంట నష్టపరిహారంపైనే సోయా రైతుల ఆశలు
  • పట్టని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు
  • విక్రాంత్ కంపెనీ రకం సోయా వేసి నష్టపోయిన రైతులు
  • ఎకరానికి రూ.5 వేలు చెల్లించేందుకు ఎమ్మెల్యే సమక్షంలో ఒప్పందం 

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదు. వానాకాలం ప్రారంభంలో వ్యాపారులు రైతులకు నకిలీ సీడ్స్​ అంటగట్టారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో నష్టపోయారు. ఆఫీసర్లు.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతులు నిండా మునిగారు. 
రెండేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిపివేసింది. దీంతో రైతులు ప్రైవేట్​వ్యాపారుల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు సీడ్​​ వ్యాపారులు నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టి దోచుకుంటున్నారు. ఈ ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల్లో విక్రాంత్ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు మొలకెత్తలేదు. నష్టపోయిన రైతులు సీడ్స్​ షాపుల ఎదుట ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష పార్టీలూ నిరసనలు వ్యక్తంచేశాయి. దిగివచ్చిన కంపెనీ ప్రతినిధులు దిగివచ్చి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నతో సమావేశమై పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నెలలు గడుస్తున్నా.. పరిహారం రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎప్పుడిస్తరో..?
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పరిహారం అందలేదు. విత్తన బ్యాగుకు రూ. 5 వేలు ఇస్తామని ఎమ్మెల్యే సమక్షంలో ఒప్పుకున్న కంపెనీ ఇంత వరకు దాని గురించి పట్టించుకోలేదు. రైతులు పరిహారం కోసం అటు అగ్రికల్చర్ ఆఫీసర్లు, డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. పరిహారం ఎవరిస్తారు? ఎలా ఇస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆయోమయానికి గురవుతున్నారు. తాము నష్టపోయిన పంట వివరాలు తెలుసుకునేందుకు ఆఫీసర్లు, విత్తన కంపెనీ ప్రతినిధులు ఇంకా రాలేదని.. సమయానికి డబ్బులు వస్తే మిగతా పంటలు వేసుకుంటామని చెబుతున్నారు. సోయా విత్తనాలకు సంబంధించి బిల్లులు, లాట్​ నంబర్, ప్యాకెట్లను కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలని ప్రచారం జరుగుతుండగా, చాలా మంది రైతులు ప్యాకెట్లు, లాట్ నంబర్లు లేవని చెబుతున్నారు. కొంత మంది బిల్లులు కూడా దాచుకోలేదు. అందుబాటులో ఉంచుకోలేదని తెలుస్తోంది. ఈక్రమంలో అటు పరిహారం వివరాల కోసం అధికారులు రైతులను సంప్రదించలేదు. పరిహారం ఇచ్చే సమయంలో కంపెనీలు ఏ మెలిక పెడుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

14 ఎకరాల్లో మొలకెత్తలేదు..
పద్నాలుగు ఎకరాల్లో 14 బ్యాగుల విక్రాంత్ సీడ్ వేశాను. బ్యాగ్ విత్తనాలు కూడా మొలకెత్తలేదు. పరిహారం ఇవ్వాలని ఫర్టిలైజర్ షాపులో అడిగితే.. కంపెనీ వాళ్లను అడగమంటున్నారు. వాళ్లను అడిగితే షాపులో రిసిప్ట్​లు ఇవ్వాలని, మేము వచ్చిన తర్వాత చూస్తామంటున్నారు. ఇలా నెల రోజులుగా ఇదే జరుగుతుంది. - సిలారి రమినివాస్, రైతు గిర్నూర్ 

త్వరలో వివరాలు సేకరిస్తాం
ఈ ఏడాది కల్తీ సోయా విత్తనాలు వేయడంతో రైతులు నష్టపోయారు. సోయా విత్తనాలు వేసిన రైతుల వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటాం. నష్టపోయిన రైతులకు సంబంధించి పరిహారం ఇచ్చేందుకు విత్తన కంపెనీ ముందుకొచ్చింది. విత్తనాల కొనుగోలు, పంట వేసిన రైతుల వివరాలు వచ్చిన తర్వాతనే పరిహారం ఏ రూపంలో ఇవ్వాలనేది నిర్ణయం జరుగుతుంది. - పుల్లయ్య, అగ్రికల్చర్ ఆఫీసర్ 

70 వేలు నష్టపోయిన
ఎనిమిది ఎకరాల్లో విక్రాంత్ సోయా విత్తనాలు ఏసిన. వర్షాలు సమయానికి పడినప్పటికీ విత్తనాలు మొలకెత్త లేదు. నకిలీ విత్తనాలు తెలిసి అధికారుల, డీర్లను కలిసి పరిహారం ఇవ్వాలని కోరాం. ఇప్పటి వరకు ఎవరు వచ్చింది లేదు. వివరాలు తీసుకున్నది లేదు. రూ.70 వేల వరకు నష్టపోయిన. పరిహారం ఇస్తే వేరే పంటలు ఏసుకుంటం. - తుల దత్తు, రైతు సోనాల