- పర్యాటకాన్ని వెలుగులోకి తెచ్చేందుకు వినూత్న ప్రయోగం
- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్‌లోని ప్రకృతి అందాలు, అద్భుతమైన జలపాతాలు, చారిత్రక వైభవం, ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మావల హరితవనం పార్క్‌లో కలెక్టర్ మీడియా ప్రతినిధులతో కలిసి సఫారీలో పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల్లో భాగంగా ‘ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల వల్ల జిల్లా పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా స్థానిక కంటెంట్ క్రియేటర్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు.
పోటల్లో పాల్గొనేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అర్హులని తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి అందాలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా రీల్స్ లేదా వీడియోలను రూపొందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 21న ఉదయం11గంటలలోపు ఆసక్తి గల క్రియేటర్లు తమ వీడియోలను పెన్‌డ్రైవ్‌లో విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్ లో అందజేయాలన్నారు. వివరాలకు జిల్లా పర్యాటక శాఖ అధికారి వి. రవికుమార్ నంబర్9440816087ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో విష్ణువర్ధన్, అధికారులు పాల్గొన్నారు.
