- ప్రతి స్కూల్‌లో ఇంకుడు గుంత నిర్మాణానికి శ్రీకారం
- ఇప్పటికే 109 స్కూళ్లలో ప్రారంభమైన పనులు
- వృథాగా పారే నీటితో పాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టేలా చర్యలు
- స్టూడెంట్లు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా ప్రణాళిక
ఆదిలాబాద్, వెలుగు : నీటి సంరక్షణపై స్టూడెంట్లకు అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సరికొత్త కార్యక్రమానికి శ్రీకాం చుట్టారు. ‘మన ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంతో ఇప్పటికే స్టూడెంట్లలో చైతన్యం తీసుకొస్తుండగా.. తాజాగా ‘మన బడి.. మన నీరు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ స్కీమ్ కింద స్కూళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించి .. నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. బాలల దినోత్సవం రోజున ఉట్నూర్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ‘మన బడి.. మన నీరు’ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
475 స్కూళ్లలో ఇంకుడు గుంతలు
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 475 స్కూళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించనుండగా.. ఇప్పటికే 109 స్కూళ్లలో గుంతల నిర్మాణాలు ప్రారంభించారు. ఉపాధి హామీ స్కీమ్ కింద చేపడుతున్ ఇంకుడు గుంతలకు రూ.18 వేల చొప్పున చెల్లించనున్నారు. స్కూల్‌లో వృథాగా పారే నీటిని ఈ ఇంకుడు గుంతల్లోకి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే వర్షం పడిన టైంలో స్కూల్ బిల్డింగ్ పైనుంచి వచ్చే నీరు సైతం భూమిలో ఇంకేలా రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పేరుతో మరో గుంత నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం రూ. 25 వేలు చెల్లించనున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాల్లో నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు.
భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా...
ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతున్నప్పటికీ నీటి వనరుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలే పడుతున్నాయి. కానీ నీటి ఒడిసి పట్టే పరిస్థితి లేకపోవడంతో జలవనరుల సమస్య తలెత్తుతోంది. ప్రతి ఏడాది వేసవిలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది మేలోనే భూగర్భజలాలు ఏకంగా మూడు మీటర్ల లోతుకు పడిపోయాయి. జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రతిస్కూల్‌లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. వీటి ద్వారా జల వనరుల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ పద్ధతులపై స్టూడెంట్లకు, వారి తల్లిదండ్రులు అవగాహన కల్పించనున్నారు.
