రైతులకు భద్రతేదీ?.. వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులపై దొంగల దాడితో కలకలం

రైతులకు భద్రతేదీ?.. వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులపై దొంగల దాడితో కలకలం
  • పంటకు, తమకు రక్షణ లేదంటున్న అన్నదాతలు
  • పత్తి, జొన్న కొనుగోలు సీజన్లలో మార్కెట్ కు భారీగా పంట 
  • కొనుగోళ్లలో ఆలస్యంతో రాత్రంతా పడిగాపులు
  • ఇదే అదునుగా దొంగల చేతివాటం

ఆదిలాబాద్, వెలుగు: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునేందుకు అవస్థలు పడే రైతులకు మార్కెట్ యార్డులో అమ్ముకునేందుక సైతం ఇబ్బందులు తప్పడం లేదు. పంటకే కాదు.. రైతులకూ రక్షణ లేకుండా పోయింది. ఈ నెల 14న రాత్రి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్న అమ్ముకునేందుకు వచ్చిన రైతులు దొంగల చేతిలో గాయపడ్డారు. రాత్రి నిద్రించే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు జొన్నపంట దొంగిలించే ప్రయత్నం చేయగా వారిని రైతులు అడ్డుకున్నారు. దీంతో దొంగలు రాళ్ల దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

రెండు మూడు రోజులు మార్కెట్​ జాగరణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు అతి పెద్దది. మార్కెట్​కు ఏటా పెద్దఎత్తున పత్తి, జొన్న, సోయాబీన్ పంటను రైతులు ఎక్కువగా తీసుకొస్తుంటారు. పంట మాయిశ్చర్ విషయంలో తేడాలుంటే ఆరబెట్టుకుంటారు. దీంతో రైతులు రాత్రి మార్కెట్​లోనే గడపాల్సి ఉంటుంది. ఒక్కోసారి రెండు మూడు రోజులు మార్కెట్​లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రాత్రిళ్లు మార్కెట్​లో భద్రతా చర్యలు కనిపించడంలేదు. 

ఇదే అదునుగా దొంగలు ధాన్యాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ పత్తి, శనగ, సోయాబీన్ తీసుకొచ్చిన సమయంలోనూ చాలా సందర్భాల్లో దొంగతనం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో రోడ్డుపై, మార్కెట్ యార్డులో పంటను నిల్వ ఉంచాలంటేనే భయపడిపోతున్నారు. 

భారీగా ఆదాయం వచ్చినా వసతులు నిల్

ఈ మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలతో సెస్ రూపంలో ఏటా రూ.8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో మార్కెట్​లో సదుపాయాలతోపాటు అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రైతులకు వసతులే కాదు.. భద్రత కూడా కల్పించడంలేదు. మార్కెట్ యార్డులో భద్రత లేకపోవడంతో చోరీలు, అడ్డుకున్న రైతులపై దాడులు జరగుతున్నాయి. అసలు మార్కెట్​కు వచ్చిపోయేవారిపై ఎలాంటి నిఘా లేకుండాపోయింది. 

అయితే తాజాగా రైతులపై దాడులు జరగడంతో అధికారులు మేల్కొన్నారు. దాడులకు పాల్పడ్డ నలుగురు మైనర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సెక్యురిటీ పెంచారు. ఆరుగురు పోలీసులను షిఫ్ట్ వైజ్​గా బందోబస్తు నియమించారు.

భద్రత ఏర్పాటు చేశాం..

వ్యవసాయ మార్కెట్ యార్డులో పోలీసు బందోబస్తు కోసం డీఎస్పీకి లేఖ రాశాం. ఆయన స్పందించి ఆరుగురు పోలీసు సిబ్బందిని నియమించారు. 24 గంటల పాటు షిఫ్ట్ వైజ్​గా మార్కెట్​లో  బందోబస్తు ఉంటుంది.  మార్కెట్​లో సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తాం. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.  గజానంద్, మార్కెటింగ్ ఏడీ, ఆదిలాబాద్