- ఆందోళనకు దిగిన బీజేపీ కౌన్సిలర్లు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన సోమవారం నిర్వహించిన అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఎజెండాను చదివి వినిపించారు. పట్టణంలోని సర్వే నంబర్ 349లోని విజయ డెయిరీకి సంబంధించిన పాత పాల శీతలీకరణ కేంద్రం స్థలంలో ఎకరం భూమిని కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి ఇచ్చేందుకు ఎన్వోసీ ఇచ్చేందుకు సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.
పోడియం ముందు ఎజెండా ప్రతులను చింపి నిరసన తెలిపారు. గందరగోళం మధ్య ఓటింగ్ నిర్వహించగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు పలువురు ఇండిపెండెంట్ సభ్యులు మద్దతు తెలపడంతో తీర్మానం పాస్ అయినట్లు ప్రకటించారు. కాగా, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కోరం లేకపోయినా తీర్మానం నెగ్గినట్లు చెబుతున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ముందు బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు.
