- శాఖల మధ్య సమన్వయలోపమే కారణం
- ట్రాఫిక్ సమస్యతో ప్రజల ఇబ్బందులు
- ఏప్రిల్‌లోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు
- రూ.97.20 కోట్లు కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణ వాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. కేంద్రం రూ.39.49 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.57.71 కోట్లు మొత్తం రూ.97.20 కోట్లు కేటాయించగా.. మూడేండ్ల కిందట బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు పూర్తి కాలేదు. రైల్వే ట్రాక్ భాగంలోని పనులు రైల్వే శాఖ, మిగతా పనులు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జి, స్పిన్నింగ్ మిల్లు ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు.
వంతెన నిర్మాణంలో భాగంగా ఇప్పటివరకు 30 పిల్లర్లు వేసి, స్లాబ్పూర్తి చేశారు. ఎల్‌ఐసీ కార్యాలయం వైపు బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా.. భూ సేకరణలో జాప్యం కారణంగా ఆలస్యమవుతోంది. తాంసి బస్టాండ్ నుంచి పంజాబ్ చౌక్ వరకు బ్రిడ్జి నిర్మాణ వెడల్పు12.40 మీటర్లు, బీటీ రోడ్డు కోసం 7.50 మీటర్ల స్థలం అవసరమని సర్వే చేశారు. అలాగే, స్పిన్నింగ్ మిల్లు వద్ద నిర్మించే బ్రిడ్జి కోసం వెడల్పు 11.80 మీటర్లు, బీటీ రోడ్డు కోసం 14 మీటర్లు, మట్టి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణానికి మరో 7 మీటర్ల స్థలం సేకరణ చేపట్టాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు నిర్మించిన పిల్లర్ల పనులు ప్రభుత్వ భూమి కావడంతో పూర్తయ్యాయి.
మూడేళ్లుగా..
ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 2023 జనవరిలో పరిపాలన అనుమతులు ఇచ్చింది. అయితే మొదటగా రూ.27 కోట్లతో టెండర్పిలవగా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నాలుగు సార్లు దరఖాస్తులు ఆహ్వానించినా ఒక్కరూ రాకపోవడంతో ఐదోసారి రూ.30 కోట్లకు అంచనాలు పెంచారు. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ టెండర్దక్కించుకుంది. 2023 మేలో పనులు ప్రారంభించగా.. 2024 నవంబర్ లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది.
అయితే సదరు కాంట్రాక్టర్ పనులను స్లాబ్ వరకే పూర్తి చేశాడు. నిధులు విడుదల కాపోవడం, స్థల సేకరణలో జాప్యం జరిగి, 6 నెలలుగా పనులు నిలిచిపోయాయి. తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిని రూ.20 కోట్లతో నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రైవేట్ షాపులకు అధికారులు గతంలోనే మార్కింగ్ ఇచ్చారు. పరిహారం చెల్లింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు.
వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు డెడ్ లైన్
వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు బ్రిడ్జిల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఇటీవల ఈ పనులపై అధికారులతో సమీక్షించారు. ఆగిపోయిన పనులను వచ్చే నెలలో ప్రారంభించాలని చెప్పారు. భూసేకరణ, సాంకేతిక అనుమతులు తుది దశలో ఉన్నాయన్నారు. అయితే నిధుల లేమి, శాఖల మధ్య సమన్వయ లోపంతో పనుల్లో పురోగతి కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ రంగంలోకి దిగి బ్రిడ్జి పనులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. భూ సేకరణ వేగవంతం చేయాలని, రైల్వే అధికారులు మున్సిపల్, ఆర్అండ్ బీ, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.
నిత్యం ట్రాఫిక్ సమస్య
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి, ఇక్కడి ప్రజలకు బ్రిడ్జిలు ఎంతో అవసరం. తాంసి బస్టాండ్ వద్ద ఉన్న రైలు పట్టాల అవతలివైపు ఆదిలాబాద్ పట్టణ ప్రజలు, తాంసి, తలమడుగు మండలాలతోపాటు మహారాష్ట్ర నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చే ప్రజలు ఆదిలాబాద్‌కు రావాలంటే రైల్వే క్రాసింగ్ దాటాల్సి ఉంటుంది. తాంసి బస్టాండ్‌తో పాటు స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ లు ఉండటంతో రైళ్ల రాకపోకల సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. నిత్యం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలతోపాటు ఇక్కడి నుంచి వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. అంబులెన్స్ వచ్చినా ఆగిపోవాల్సిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
