
ఉమ్మడి ఆదిలాబాద్‌లో గర్భిణుల కష్టాలు
108 రాలేదు.. సెల్ సిగ్నల్స్ ఉండవు
అడవి బిడ్డలను అనారోగ్యాల కంటే అసౌకర్యాలే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లో వర్షాకాలం వచ్చిందంటే వందల పల్లెలకు బయటి ప్రపంచంతో కనెక్షన్ కట్ అవుతోంది. ఇన్నేళ్లైతున్నా ఎన్నో గ్రామాలకు రోడ్డు వేయకపోవడం… వాగులు, వంకలపై బ్రిడ్జిలు లేక, గతంలో కొట్టుకుపోయిన వాటిని కొన్నేళ్లుగా నిర్మించకపోవడంతో ఏజెన్సీలోని దాదాపు 350కిపైగా గ్రామాలకు ఆటోలు, మోటార్‌బైక్‌లపై కూడా రాకపోకలు సాగించలేని దుస్థితి. దీంతో ఈ ప్రాంతాల్లోని గర్భిణులను కుటుంబ సభ్యులు దవాఖానాల దగ్గరున్న చుట్టాల ఇండ్లలో ఉంచుతున్నారు. తమ పల్లెల్లోనే ఉంటే నొప్పులొస్తే 108 రాలేదు.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉండవంటున్నారు. వారిని మోసుకొని కిలోమీటర్ల దూరంలోని హాస్పిటల్లకు తీసుకెళ్లే సరికి బాధితుల ప్రాణాలమీదికి వస్తోందంటున్నారు. అందుకే వారిని హాస్పిటల్, రవాణా సౌకర్యం ఉన్న ఊర్లలోని అత్తగారి, అమ్మగారి ఇంట్లో ఉంచుతున్నామంటున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో చాలా గిరిజన గ్రామాలకు ఆటో కూడా వెళ్లలేని దుస్థితి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాల్లో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ గ్రామాల్లోకి 108 రాదు.. కనీసం ఎడ్లబండి పోదు. సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగా ఉండదు. ఇక్కడి గ్రామాల్లో ఎవరికైనా పురిటినొప్పులు వచ్చినా, అనారోగ్యం బారిన పడినా భూజాలపై వేసుకుని గుట్టలు ఎక్కి మోసుకుంటూ 40 కిలోమీటర్ల దూరంలోని జైనూర్ మండలం గుడమమడకు లేదా 15కిలోమీటర్ల దూరంలోని కెరమెరిఘాట్ వెళ్లాలి. అక్కడకు వస్తే గాని అంబులెన్స్ చేరుకోలేరు. గ్రామాలకు రోడ్డు, వాగులపై బ్రిడ్జిలు లేక అత్యవసర పరిస్థితిలో వైద్యం అందదని ఈ ప్రాంతం వారు డెలివరీ కోసం గర్భిణులను వైద్య సౌకర్యం అందుబాటులో ఉన్న అమ్మగారి, అత్తగారి ఇండ్లకు లేదంటే బంధువుల ఇండ్లకు పంపుతున్నారు. బడికి సెలవులు ఇచ్చినా వాగుదాటి రాలేరని పిల్లలను స్కూల్లోనే ఉంచుతున్నారు.
అత్తారింటికి పంపుతున్నం
ఎంత గరీబోళ్లైన తమ బిడ్డకు గర్భం వస్తే పుట్టింటికి తెస్తారు. మేమ అత్తారింటికి పంపుతున్నం. బాధగా ఉన్నా ఇక్కడ ఎలాంటి సౌలత్‌లు లేకపోవడంతో తప్పడం లేదు. వాగు ఉప్పొంగితే 2 రోజుల దాక ఇటోళ్లు అటు పోలేరు.. అటోళ్లు ఇటు రాలేరు.
-చౌహన్ లీలబాయి, కిషన్ నాయక్ తండా
జ్వరం వస్తే చావు దగ్గర పడ్డట్లే
వర్షకాలంలో మా పల్లెల్లో జ్వరం వస్తే చావు దగ్గర పడ్డట్లే. దవాఖానాకు పోవాలంటే రోడ్డు లేదు. రోడ్డు సౌలత్ లేక బాధలు పడుతు న్నం. అధికారులు పట్టించుకోలే. కిషన్ నాయక్ తండాకు చెందిన రాములు జ్వరం వచ్చి.. దవాఖానకు పోలేక చనిపోయిండు.
– దుందేరావు, ఉప సర్పంచ్, చింతకర్ర