
బీహార్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. నెల రోజుల పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత శుక్రవారం(ఆగస్టు 1) ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో ఏకంగా 65.2 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమం ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం, మరణించిన ,వలస వెళ్ళిన ఓటర్ల వివరాలను అప్‌డేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని 7.89 కోట్ల మంది నమోదైన ఓటర్లలో 91.69% మంది అంటే దాదాపు 7.24 కోట్లు మంది తమ గణన ఫారాలను (Enumeration Forms - EFలు) సమర్పించినట్లు ECI గతంలో ప్రకటించింది.
విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం..మొత్తం 65.2 లక్షల మంది ఓటర్ల పేర్లను వివిధ కారణాలతో తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 22లక్షల34వేల 501 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. వలసవెళ్లడం, అడ్రస్ దొరక్కపోవడంతో 36లక్షల28వేల210 మంది ఓటర్ల పేర్లను లిస్టునుంచి తొలగించారు. ఇక 7లక్షల 01వేల364 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో నమోదు చేసుకున్న కారణంగా వారి ఓట్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించింది.
అభ్యంతరాలుంటే..
ఓటర్లు లేదా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 1 వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు ,అభ్యంతరాలను దాఖలు చేసే అవకాశం కల్పించింది ఈసీ. ఓటర్ లిస్టులో పేరు లేనట్లు గుర్తిస్తే అర్హత కలిగిన ఓటర్లు తమ పేర్లను తిరిగి జోడించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జాబితాలో ఏమైనా తప్పులు సరిచేసేందుకు, అర్హత లేని ఎంట్రీలను తొలగించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
►ALSO READ | భూమి పరిశీలనకు సిద్ధం..కీలక దశలోకి NISAR ఉపగ్రహం
2024 జూలై 1 నాటికి లేదా అంతకు ముందు 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లు, అలాగే 2024 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఓటర్లు కూడా ఫారమ్ 6 ,డిక్లరేషన్ ఫారమ్ ఉపయోగించి ఓటు హక్కుకోసం నమోదు చేసుకోవాలి.అన్ని అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించనున్నారు.