భూమి పరిశీలనకు సిద్ధం..కీలక దశలోకి NISAR ఉపగ్రహం

భూమి పరిశీలనకు సిద్ధం..కీలక దశలోకి NISAR ఉపగ్రహం

ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన NISAR మిషన్ కీలకదశకు చేరుకుంది. మిషన్ లో అత్యంత ముఖ్యమైన 90 రోజులు కమిషనింగ్ దశలోకి నిసార్ ప్రవేశించింది. ఈ కాలంలో శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని పూర్తిస్థాయిలో భూపరిశీలనకు సిద్దం చేస్తారు. 

నాసా, -ఇస్రో కలిసి ప్రయోగించిన ఉపగ్రహం NISAR (NASA-ISRO Synthetic Aperture Radar) మిషన్. NISAR కమిషనింగ్ దశ అనేది ఉపగ్రహాన్ని పూర్తిస్థాయిలో భూమి పరిశీలనలకు సిద్ధం చేయడానికి చేసే కీలకమైన ప్రక్రియ. ప్రయోగం తర్వాత సుమారు 90 రోజుల పాటు ఈ దశ ఉంటుంది. ఈ సమయంలో శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైన పనులు నిర్వహిస్తారు. 

ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు అంటే దాని మెయిన్‌ఫ్రేమ్, రాడార్ ఎలక్ట్రానిక్స్ ,ఇతర ఆన్‌బోర్డ్ పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వాటిని సరైన క్రమంలో ఉంచుతారు. 

కక్ష్య సర్దుబాట్లు: NISAR ఉపగ్రహం ప్రస్తుతం 737 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ఉంది. దీన్ని 747 కిలోమీటర్ల ఎత్తుకు పెంచడానికి సుమారు 45నుంచి -50 రోజులు పడుతుంది. ఈ సర్దుబాట్లు రాడార్ డేటా సేకరణకు సరైన స్థానాన్ని నిర్ధారిస్తాయి.

►ALSO READ | నెరవేరిన కల.. 33 ఏళ్ల సినీ కెరీర్లో.. షారుఖ్ ఖాన్కు తొలి నేషనల్ ఫిలిం అవార్డు !

రాడార్ యాంటెనా విస్తరణ: NISAR 12 మీటర్ల వెడల్పున్న పెద్ద మెష్ రిఫ్లెక్టర్ (రాడార్ యాంటెన్నా)ను కలిగి ఉంది. ప్రయోగం సమయంలో ఇది మడతపెట్టబడి ఉంటుంది. కమిషనింగ్ దశలో దీనిని అంతరిక్షంలో జాగ్రత్తగా విప్పుతారు. ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది.ప్రత్యేక శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. 

ఈ కమిషనింగ్ దశ పూర్తయిన తర్వాత రాడార్లు పూర్తిగా యాక్టివేట్ చేస్తారు. ఉపగ్రహం భూమి నుంచి అన్ని భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలనుంచి డేటాను సేకరించడం ప్రారంభిస్తుంది. భూమిపై జరిగే మార్పులు ముఖ్యంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు, హిమానీనదాల కదలికలు, అటవీ విస్తీర్ణం,వ్యవసాయ భూముల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని 5x5 మీటర్ల స్పష్టతతో ఫొటోలు తీస్తుంది NISAR ఉపగ్రహం. 

కమిషనింగ్ దశ అనేది NISAR మిషన్ తన ప్రధాన పనులను ప్రారంభించేందుకు ముందు జరిగే చివరి ,అత్యంత ముఖ్యమైన సన్నాహక దశ.