
- బ్యాక్‌వాటర్ నుంచి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగాతరలించుకుపోతున్న ఏపీ
- స్పిల్‌వేను తలపించే 14 గేట్లతో వచ్చిన వరదను వచ్చినట్లే మలుపుతున్న పోతిరెడ్డిపాడు
- అప్రోచ్ చానల్, కాలువల కెపాసిటీని భారీగా పెంచడంతో సీమ వైపు పరుగు
- పోతిరెడ్డిపాడుకు తోడైన హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్టులు
- బనకచర్ల దిగువన కాల్వల కెపాసిటీని పెంచే పనులు సైతం ప్రారంభించిన ఏపీ
- ఇప్పటికే రైట్ మెయిన్ కెనాల్ ఆధునీకరణ పూర్తి.. ఇప్పుడు తెలుగు గంగకూ లైనింగ్
- పోతిరెడ్డిపాడు, బనకచర్ల వద్ద సెక్యూరిటీ, సీసీ కెమెరాలతో పకడ్బందీ నిఘా
మహబూబ్‌నగర్, వెలుగు: శ్రీశైలం చేరకముందే కృష్ణమ్మ సీమకు మళ్లుతున్నది. ఏపీ చెప్తున్న వివరాలకు, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించుకుపోతున్న నీటి లెక్కలకు భారీ తేడా కనిపిస్తున్నది. 14 తూములతో స్పిల్‌వేను తలపిస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ల ద్వారా కృష్ణా నదికి వస్తున్న వరదను సగానికి సగం అటు నుంచి అటే మళ్లించుకుంటున్నది. కొద్దిరోజులుగా ఇక్కడి నుంచి రోజుకు కేవలం 30 వేల క్యూసెక్కులను తరలిస్తున్నట్లు ఏపీ అధికారులు చెప్తున్నా.. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినప్పుడు లక్ష క్యూసెక్కులకు మించి తరలిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. పోతిరెడ్డిపాడు వద్ద ఇప్పటికే అప్రోచ్ చానల్ కెపాసిటీ పెంచుకున్న ఏపీ.. ఇప్పుడు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్(ఎస్ఆర్ఎంసీ) సహా కాల్వల సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది. అంతేకాకుండా పోతిరెడ్డిపాడుతో ఆగకుండా.. అటు హంద్రీనీవా, ఇటు ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా మరో 50 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకుంటూ యథేచ్ఛగా నీటి దోపిడీకి పాల్పడుతున్నట్లు ‘వెలుగు’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, గతంలో 880 అడుగులు నిండాక మాత్రమే పోతిరెడ్డిపాడు తూముల ద్వారా నీటిని తీసుకునేలా ఏర్పాటు ఉండేది. 11,500 క్యూసెక్కుల చొప్పున రోజుకు ఒక టీఎంసీ మాత్రమే తరలించేలా పరిమితి ఉండేది. కానీ వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా తూముల ఎత్తు తగ్గించి 854 అడుగుల స్థాయి నుంచే రోజుకు 4 టీఎంసీలను తీసుకునేలా కెపాసిటీ పెంచుకున్నారు. ఆ తర్వాత కాలంలో హెడ్ రెగ్యులేటర్‌ను 14 తూములకు పెంచి, రోజుకు 8 టీఎంసీలకు పైగా తోడుకునే స్థాయికి పోతిరెడ్డిపాడును విస్తరించారు. శ్రీశైలం నీటి మట్టం 800 టీఎంసీలకు పడిపోయినా లిఫ్ట్‌చేసి మరీ పోతిరెడ్డిపాడు ద్వారా తరలించేందుకు జగన్హయాంలో రాయలసీమ లిఫ్ట్స్కీమ్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ‘వెలుగు టీమ్’ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పోతులపాడు గ్రామ శివారులోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు వెళ్లినప్పుడు అక్కడి సీన్చూసి కళ్లు బైర్లుగమ్మాయి. అది పేరుకే ఒక హెడ్‌రెగ్యులేటర్.. 14 గేట్లతో ఒక బరాజ్‌ను తలపిస్తున్నది. వీలైనన్ని ఎక్కువ నీళ్లను మళ్లించుకునేందుకు వీలుగా హెడ్ రెగ్యులేటర్ నుంచి నది వరకు ఒకటిన్నర కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర అప్రోచ్ చానల్ కెపాసిటీని ఏపీ సర్కారు భారీగా పెంచుకున్నది.
కృష్ణా నీళ్లు హెడ్‌రెగ్యులేటర్ వైపు దూసుకొచ్చేందుకు అడ్డుగా ఉన్న చిన్న చిన్నగుట్టలన్నింటినీ తొలగించింది. దీంతో ఎలాంటి అడ్డూ లేకుండా ఎగువ నుంచి వస్తున్న కృష్ణానది శ్రీశైలంలోకి వెళ్లక ముందే సీమవైపు దారి మళ్లుతోంది. పేరుకు 30 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ, లక్ష క్యూసెక్కులకు పైగా వెళ్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఇంత భారీ మొత్తంలో నీళ్లు వెళ్లేందుకు అనుకూలంగా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ)ను ఏపీ ఇప్పటికే విస్తరించింది. ఈ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పోతులపాడు, తుమ్మలూరు, ఆనందపురం, రుద్రవరం, పాములపాడు, ఎర్రగూడూరు గ్రామ సమీపంలోని బనకచర్ల వరకు 16.4 కిలోమీటర్ల పొడువునా ఎస్ఆర్ఎంసీ ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ఒకప్పుడు 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించే కెపాసిటీ ఉన్న ఈ కెనాల్‌ను.. ఇప్పుడు లక్ష క్యూసెక్కులను తరలించేలా విస్తరించడంతో బనకచర్ల వరకు అది కాలువలా కాకుండా ఒక నదిలా మారిపోయింది. ఈ కెనాల్‌లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నీటిని చూసి ఎక్కడ తెగుతుందోనని చుట్టుపక్కల రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వాయర్‌ను తలపిస్తున్న బనకచర్ల..
పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం రైట్‌మెయిన్ కెనాల్‌ద్వారా బనకచర్ల జంక్షన్‌కు వచ్చే నీటిని నిల్వ చేసేందుకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల పొడువునా కెనాల్‌ను ఏపీ విస్తరించింది. పైనుంచి వచ్చే వరద హెచ్చుతగ్గులను తట్టుకునేలా, వరద తగ్గుముఖం పట్టాక వాడుకునేలా 3 నుంచి 4 టీఎంసీల నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా ఇక్కడికి ప్రతిరోజూ లక్ష క్యూసెక్కుల వరకు నీరు వస్తుండగా.. గాలేరు నగరి, ఎస్ఆర్‌బీసీ, తెలుగు గంగ కాలువల ద్వారా సీమకు తరలిస్తున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్)కి చెందిన ఆరు తూముల ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
ఇందుకోసం 120 టీఎంసీల కెపాసిటీ ఉన్న గండికోట, వామికుంట, సర్వరాయసాగర్, గొరకల్లు, అవుకు రిజర్వాయర్లను నింపుతున్నారు. వీటి కింద చిన్నాచితకా మరో 11 రిజర్వాయర్లు ఉన్నాయి. మరో కీలకమైన శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఆర్‌బీసీ) ద్వారా కర్నూల్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 80 టీఎంసీల కెపాసిటీ ఉన్న అలగనూరు, ఓక్, శ్రీనరసింహరాయ సాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. ఇక్కడే ఎస్కేప్ చానల్ ద్వారా 40 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన మూడు తూముల నుంచి ఎస్‌ఆర్‌బీసీకి మళ్లిస్తున్నారు. చివర్లో ఎడమ వైపు ఉన్న తెలుగు గంగ (రాయలసీమ లిఫ్ట్) కెనాల్‌కు ప్రస్తుతం భారీ మొత్తంలో నీరు తరలుతున్నది. మెయిన్కెనాల్తో పాటు ఈ కాలువ కెపాసిటీని పెంచేందుకు పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కెనాల్ నుంచి ముందుగా 60 టీఎంసీల కెపాసిటీ ఉన్న వెలుగోడు రిజర్వాయర్నింపి, అక్కడి నుంచి రుద్రవరం లేక్, తెలుగు గంగ రిజర్వాయర్, తెలుగు గంగ రిజర్వాయర్–2, బ్రహ్మసాగర్, సోమశిల, కండలేరు, పూండి రిజర్వాయర్లకు నీటిని తరలిస్తున్నారు. ఈ రిజర్వాయర్ల కెపాసిటీ దాదాపు 100 టీఎంసీల వరకు ఉండడం గమనార్హం. వీటిపైనా పదుల సంఖ్యలో లిఫ్టులు పెట్టి సీమలో మూలమూలాలకూ ఏపీ నీళ్లు ఇస్తున్నది.
ఏపీ చెప్తున్నవన్నీ దొంగ లెక్కలే..
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్న కృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లే ఎస్ఆర్ఎంసీ కెపాసిటీని లక్ష క్యూసెక్కులకు పెంచడంతో ప్రస్తుతం గట్లు ఒరుసుకుంటూ కాలువ సాగుతున్నది. కానీ కేవలం 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కుల నీటినే తీసుకుపోతున్నట్టు ఏపీ చెప్పడంపై విస్మయం కలుగుతున్నది. నిజానికి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎస్ఆర్ఎంసీ నుంచి ఎస్కేప్చానల్, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగకు వేర్వేరు తూముల ద్వారా నీరు సీమ వైపు తరలిస్తుండగా.. ఒక్కో కెనాల్ కెపాసిటీ 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుకోవడంతో ఏపీ చెప్తున్న లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్వద్ద టెలీమెట్రీలు ఏర్పాటు చేస్తే తప్ప.. ఏపీ ఎంత నీటిని ఎత్తుకెళ్తుందనే విషయంలో స్పష్టత రాదు. కానీ అందుకు ఏపీ అంగీకరించడం లేదు.
లిఫ్టులతోనూ ఎత్తిపోస్తున్నరు
పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా నదిని మళ్లిస్తున్న ఏపీ.. దీని ఎగువన ముచ్చుమర్రి, మల్యాల వద్ద లిఫ్టులను నిరంతరాయంగా నడుపుతున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ 798 అడుగులకు పడిపోయినా ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోసుకునేలా ఈ లిఫ్టును డిజైన్ చేశారు. ఇందుకోసం అక్కడున్న గుట్టలను తొలిచారు. పంపుహౌస్ వరకు నీళ్లు వచ్చేందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తవ్వకాలు చేపడ్తున్నారు. కర్నూల్–-కడప కెనాల్(కేసీసీ)కు సుంకేసుల రైట్ కెనాల్ నుంచి నీటి సరఫరా ఆగిపోయినా, తుంగభద్ర నదికి వరద లేకున్నా ముచ్చుమర్రి నుంచి కృష్ణా జలాలను కేసీసీకి లిఫ్ట్ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీని ఎగువన 20 కిలోమీటర్ల దూరంలో మల్యాల వద్ద ఏపీ ఇటీవల మరో లిఫ్టును ప్రారంభించింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) లిఫ్ట్ పేరుతో కృష్ణా జలాలను తోడుకుపోతున్నది. రెండు దశల్లో వీటి పనులు చేపట్టాల్సి ఉండగా.. కొద్ది రోజుల కింద మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ లిఫ్టును ప్రారంభించగా.. మొత్తం 12 పంపుల్లో ప్రస్తుతం ఆరు పుంపుల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని ఎత్తి పోస్తున్నారు. 20 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కెనాల్ ద్వారా కృష్ణగిరి, పత్తికొండ, జీడీపల్లి రిజర్వాయర్లను నింపుతున్నారు. 11 పంపుహౌస్‌ల నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాల వరకు నీటిని తీసుకుపోతున్నారు. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ లిఫ్ట్ ఫేజ్-2 కూడా పూర్తి చేసేలా పనులు స్పీడప్ చేస్తున్నారు. ఈ పనులు పూర్తి చేస్తే దీని కింద 30 టీఎంసీల కెపాసిటీ ఉన్న గొల్లపల్లి, మర్ల, చర్లపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం కలుగుతుంది.
పోతిరెడ్డిపాడు, బనకచర్ల వద్ద గట్టి నిఘా
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిఘా పెంచింది. ఏపీ చెప్తున్న దానికి మూడు రెట్లు అధికంగా నీరు తరలివెళ్తుండడంతో ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ప్రధానంగా పోతిరెడ్డిపాడు వద్ద మఫ్టీలో ఉన్న సిబ్బంది డ్యామ్ పైకి వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కొత్తవాళ్లు కనిపిస్తే వారి ఐడీ కార్డులు చూపించుమని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. అటు బకనచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎడమ వైపు తెలుగు గంగ కెనాల్ ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ఎస్కేప్ చానల్, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ తూముల వద్దకు వెళ్లే మార్గం ఉండడంతో అక్కడి సిబ్బంది కొత్తవాళ్లపై నిఘా పెట్టి, ఎప్పటికప్పుడు పై అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు.