71st National Film Awards 2025 : జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాల హవా.. భగవంత్‌ కేసరి, హనుమాన్‌, బలగం లకు అవార్డుల పంట

71st National Film Awards 2025 : జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాల హవా.. భగవంత్‌ కేసరి, హనుమాన్‌, బలగం లకు అవార్డుల పంట

భారత చలనచిత్ర పరిశ్రమలో 71వ జాతీయ చలనచిత్ర పురస్కారరాలలో ఈ సారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండింది.  2023లో విడుదలైన వందలాది చిత్రాల నుంచి ఎంపిక చేసిన విజేతలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.  నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవంత్‌ కేసరి' చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ నటన, ముఖ్యంగా తండ్రి-కూతురి మధ్య ఉన్న ఎమోషనల్ బంధం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. శ్రీలీల, కాజల్ అగర్వాల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ విజయంపై చిత్ర బృందం, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 అనిల్ రావిపూడి కృతజ్ఞతలు
'భగవంత్‌ కేసరి' చిత్రానికి జాతీయ అవార్డు రావడం పట్ల దర్శకుడు అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. "మీ అపారమైన ప్రేమ మరియు మద్దతుతో, ఈ సందేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. మా కృషిని గుర్తించిన జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నిరంతరం మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఈ విజయం పెద్ద కలలు కనే, ధైర్యంగా గర్జించే ప్రతి కూతురిది!" అని ఆయన ట్వీట్ చేశారు.

 

'హను-మాన్‌' సంచలనం..  డబుల్ ధమాకా!
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హను-మాన్‌' చిత్రం చిన్న చిత్రంగా విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)  ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలలో రెండు జాతీయ అవార్డులు లభించాయి. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.

'బలగం' గీతానికి ప్రత్యేక గుర్తింపు
వేణు యెల్దండి దర్శకత్వంలో, తెలంగాణ పల్లె వాతావరణం, అనుబంధాలను ఆవిష్కరించిన 'బలగం' చిత్రంలోని 'ఊరు పల్లెటూరు' పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటలోని హృదయాన్ని హత్తుకునే సాహిత్యం అందరినీ కదిలించింది.

'బేబీ' చిత్రానికి అవార్డుల పంట
యువతను విశేషంగా ఆకట్టుకున్న 'బేబీ' చిత్రానికి కూడా జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లేకి గానూ దర్శకుడు సాయి రాజేశ్‌కు, ఉత్తమ నేపథ్య గాయకుడిగా 'ప్రేమిస్తున్నా' పాట పాడిన పీవీఎన్‌ ఎస్‌ రోహిత్‌కు అవార్డులు దక్కాయి.

బాల నటికి జాతీయ పురస్కారం
డైరెక్టర్ సుకుమార్ కుమార్తెకు ఉత్తమ బాలనటి అవార్డు వరించింది.  'గాంధీ తాత చెట్టు' చిత్రంలో నటనకు గానూ ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

మొత్తంగా, 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగు చిత్రాలు గొప్ప గుర్తింపు సాధించి,  తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాయి.  తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో విజేతలు నిలవడం పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.