గమ్యం చేరిన ‘ఆదిత్య ఎల్1’.. ఫైనల్​ ఆర్బిట్​లోకి చేరిన స్పేస్ క్రాఫ్ట్

గమ్యం చేరిన ‘ఆదిత్య ఎల్1’.. ఫైనల్​ ఆర్బిట్​లోకి చేరిన స్పేస్ క్రాఫ్ట్
  • 125 రోజుల్లో15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం
  • ఇకపై ఐదేండ్లపాటు సూర్యుడిపై నిరంతరం పరిశోధనలు

బెంగళూరు : సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో పంపిన ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో తన గమ్య స్థానం అయిన లాగ్రాంజియన్ పాయింట్–1 (ఎల్1)కు చేరుకున్నది. ఎల్1 పాయింట్ చుట్టూ ఉన్న హ్యాలో ఆర్బిట్ లోకి ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ ను శనివారం సాయంత్రం విజయవంతంగా చేర్చినట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రకటించింది. అంతరిక్షం నుంచి పరిశోధనలు చేసే అబ్జర్వేటరీ (స్పేస్ క్రాఫ్ట్)ను భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయం సాధించిన భారత్.. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాత స్పేస్ అబ్జర్వేటరీని ప్రయోగించిన ఐదో దేశంగా నిలిచింది. ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో 2023 సెప్టెంబర్ 23న ఏపీలోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ57 రాకెట్ ద్వారా ప్రయోగించింది. అనంతరం ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో 125 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎల్1 పాయింట్ కు చేరుకుంది.

‘ఆదిత్య’ మిషన్ లైఫ్ ఐదేండ్లు..  

సూర్యుడికి, భూమికి మధ్య.. భూమి నుంచి 15 లక్షల కి.మీ. దూరంలో ఎల్1 పాయింట్ ఉంది. ఇక్కడి నుంచి సూర్యుడిని ఏడాది పొడవునా నిరంతరం ఎలాంటి అవాంతరాలు లేకుండా పరిశీలించేందుకు వీలు కానుంది. ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడి నుంచి ఐదేండ్లపాటు నిరంతరం సూర్యుడిని స్టడీ చేయనుంది. సూర్యుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ లతో పాటు ఔటర్ లేయర్ అయిన కరోనాలో జరిగే మార్పులను ఇది గమనించనుంది. సూర్యుడి వాతావరణ మార్పులు, సౌరగాలుల ప్రభావం అంతరిక్షంతోపాటు మన భూమిపై ఎలా ఉంటుందన్నదీ అధ్యయనం చేయనుంది. ఇందుకోసం స్పేస్ క్రాఫ్ట్ లో 7 అధునాతన పరికరాలను ఇస్రో అమర్చింది. వీటిలో వెల్క్ (విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్), సోలెక్సెస్ (సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్), పాపా (ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య), సూట్ (సోలార్ అల్ట్రావయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్), యాస్పెక్స్ (ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్), హైఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్ (మ్యాగ్నెటోమీటర్స్) వంటివి ఉన్నాయి. వీటిలో ఇదివరకే 4 పరికరాలు విజయవంతంగా పనిచేయడం ప్రారంభించాయి. మిగతా మూడింటినీ రాబోయే రోజుల్లో ఇస్రో స్విచ్ ఆన్ చేయనుంది.

ఇది మరో మైలురాయి :  ప్రధాని మోదీ

ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా గమ్య స్థానానికి చేర్చడం పట్ల ఇస్రో సైంటిస్టులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది మరో మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘అతిక్లిష్టమైన స్పేస్ మిషన్లను సైతం సక్సెస్ ఫుల్ చేయడంలో మన సైంటిస్టుల నిరంతర శ్రమ, డెడికేషన్ ను ఈ విజయం చాటిచెబుతోంది. ఇస్రో సైంటిస్టులు సాధించిన ఈ అద్భుత విజయానికి దేశ ప్రజలందరితో పాటు నేనూ అభినందనలు తెలుపుతున్నా. మానవాళి సంక్షేమం కోసం సైన్స్ ప్రయోగాలు చేపట్టడంపై ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్దాం..” అని ప్రధాని పేర్కొన్నారు.