ఓట్లప్పుడేనా? ఇప్పుడు గిరిజనులు గుర్తుకురారా?

ఓట్లప్పుడేనా? ఇప్పుడు గిరిజనులు గుర్తుకురారా?

ఓట్లప్పుడేనా? ఇప్పుడు గిరిజనులు గుర్తుకు రావడం లేదా..? అని సీఎం కేసీఆర్‍ను ఆదివాసీ గిరిజనులు ప్రశ్నించారు. అడవినే నమ్ముకుని బతుకుతున్న తమకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని, ఆదివాసీలపై ఫారెస్ట్‌ ఆఫీసర్లు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‍ చేశారు. హరితహారం పేరుతో తమను అడవులకు దూరం చేయొద్దన్నారు. గిరిజనులపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. ఆదివాసీ పోడు రైతులు సోమవారం రైతు కూలీసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, గోండ్వానా సంక్షేమ పరిషత్‍, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం నేతృత్వంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ ముట్టడించారు.  ర్యాలీ, ముట్టడికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పారామిలటరీ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు వారిని లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. చివరకు పీవో వీపీ గౌతమ్‌ అనుమతితో  దరు నాయకులను లోనికి పంపించారు. పోడు సాగుదారుల కష్టాలను, ఫారెస్ట్‌ ఆఫీసర్ల ఆగడాలను వారు పీవోకు వివరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఆయన ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బి.వెంకట్‍, ఎన్డీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి, సీపీఐ నేత తమ్మళ్ల వెంకటేశ్వర్లులు తదితరులు పాల్గొన్నారు.