విచారణను వాయిదా వేయం .. ఏపీ అభ్యర్థనను తోసిపుచ్చిన కృష్ణా ట్రైబ్యునల్

విచారణను వాయిదా వేయం ..  ఏపీ అభ్యర్థనను తోసిపుచ్చిన కృష్ణా ట్రైబ్యునల్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కృష్ణా నది జలాల వివాదంలో ఎస్‌‌‌‌‌‌‌‌ఓసీ (స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ కేస్) దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కృష్ణా  నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్  తోసిపుచ్చింది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్‌‌‌‌‌‌‌‌  కుమార్‌‌‌‌‌‌‌‌  ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌ విచారణ సోమవారం ఢిల్లీలో జరిగింది. వివాదాలకు సంబంధించి విచారణ చేపట్టాల్సిన అంశాలపై తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌  అధికారులు ఇప్పటికే ఎస్‌‌‌‌‌‌‌‌ఓసీ దాఖలు చేయగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దాఖలు చేయలేదు. ఎన్నికల నేపథ్యంలో ఎస్‌‌‌‌‌‌‌‌ఓసీ దాఖలు చేయలేకపోతున్నామని..దాని దాఖలుకు జూన్‌‌‌‌‌‌‌‌  వరకు సమయం ఇవ్వాలని బ్రిజేష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌  ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. అయితే, ఏపీ విజ్ఞప్తిని తెలంగాణ తప్పుపట్టింది. ఈ కేసు వివాదం ఇప్పటిది కాదని, ఎస్‌‌‌‌‌‌‌‌ఓసీ దాఖలు చేయడానికి ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ను సాకుగా చూపుతున్నారని వాదించింది. ఈ వాదనతో ట్రైబ్యునల్  ఏకీభవించింది. జూన్  వరకు సమయం ఇవ్వాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని ట్రైబ్యునల్  తోసిపుచ్చింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 29 లోగా వివరణ ఇవ్వాలని ఏపీ సర్కారును ఆదేశించింది.