సర్కారు బడుల్లో సీట్లు ఫుల్

సర్కారు బడుల్లో సీట్లు ఫుల్
  • సర్కారు బడుల్లో సీట్లు ఫుల్
  • 60 - 70 స్కూళ్లలో అంతకు మించి..

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​జిల్లాలోని గవర్నమెంట్​స్కూళ్లలో సీట్లు ఫుల్​అయిపోతున్నాయి. 60 నుంచి 70 స్కూళ్లలో ఇప్పటికే ఓవర్​అడ్మిషన్లు అవుతున్నాయి. హెచ్ఎంలు, టీచర్లు తల్లిదండ్రులను భాగస్వామ్యంతో ఇప్పటికే చాలా స్కూళ్లను డెవలప్​చేశారు. పలు ఫౌండేషన్లు, కంపెనీలు సీఎస్ఆర్(కార్పొరేటర్​సోషల్​రెస్పాన్స్ బులిటీ) కింద విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. లైబ్రరీలు, డిజిటల్​క్లాసులు అందిస్తున్నాయి. కొన్ని ఫౌండేషన్లు స్కూల్​ను దత్తత తీసుకుని మరీ సదుపాయాలు కల్పిస్తున్నాయి. వీటికితోడు సర్కారు బడుల్లో చదువుకు పైసా ఖర్చు ఉండదు. పుస్తకాలు, యూనిఫాం నుంచి మధ్యాహ్న భోజనం వరకు అన్నీ ఉచితమే. దీంతో అడ్మిషన్లు అత్యధికంగా జరుగుతున్నాయి. పైగా అధిక ఫీజులు, కరోనా టైంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు అన్నిరకాల సౌకర్యాలు ఉన్న గవర్నమెంట్​స్కూళ్లను వెతికి మరీ తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఇంగ్లీష్​మీడియం స్టార్ట్​చేయడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.


అంతంత ఫీజులు కట్టే కంటే..


లాక్ డౌన్​టైంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ప్రైవేట్​స్కూళ్లలో 20 నుంచి 30 శాతం ఫీజులు పెరిగాయి. దీంతో తల్లిదండ్రులు ప్రైవేటుకు దీటుగా నడుస్తున్న, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న గవర్నమెంట్​స్కూళ్లలో పిల్లలను చేర్పిస్తున్నారు.‘‘ప్రైవేట్​స్కూళ్లలో చదివిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇంత మానసిక ఆందోళన ఉంటుందని ఊహించలేదు. నేను మెకానిక్ షాపు నడుపుతుంటాను. ఎంత కష్టమైనా పిల్లలను ప్రైవేట్ స్కూల్​లోనే చదివించాలని 
అనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఫీజులు కట్టలేకపోతున్నాను. నా సంపాదనలో ఇద్దరు పిల్లలను చదివించడం కష్టం. అందుకే వాళ్లను సర్కారీ స్కూల్ మార్చాను. ఇప్పుడు సర్కారు స్కూళ్లలోనూ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.”అని ఫిలింనగర్ బస్తీకి చెందిన మెకానిక్ మల్లేశం అన్నారు. 


టీచర్లు, హెచ్‌‌ఎంల చొరవతోనే..


చాలాచోట్ల స్కూల్ బాగుండాలని, స్టూడెంట్స్ రావాలని హెడ్‌‌మాస్టర్లు, టీచర్లు చొరవ తీసుకుంటున్నారు. ఇందుకోసం పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులతో చర్చించి మార్పులు చేస్తున్నారు. వీరికి కార్పొరేట్ సంస్థలు, పలు ఫౌండేషన్లు, దాతలు సహకారం తోడవుతోంది. విరాళాలు వస్తున్నాయి. కంప్యూటర్ ల్యాబ్‌‌లు, డిజిటల్ క్లాసులు, మధ్యాహ్న భోజనం కోసం టేబుల్స్, బెంచీలు, క్లాస్‌‌ రూముల్లో ఫర్నీచర్ వంటివి సమకూరుతున్నాయి. ఇన్ని సదుపాయాలు ఉంటుండటంతో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. 


కొన్నిచోట్ల అలా..


సిటీలోని బోరబండ, ఫిలింనగర్, రాజ్ భవన్, భోలక్ పూర్, లాలాపేట, సీతాఫల్ మండి, మడ్ ఫోర్ట్, నల్లగుట్ట తదితర స్కూళ్లలో అడ్మిషన్లు ఎక్కువగా అవుతున్నాయి. దాతలు, ప్రజాప్రతినిధుల సాయంతో టీచర్లు, హెచ్ఎంలు ఈ స్కూళ్లలో అన్ని రకాల సదుపాయాలు  కల్పించుకుంటున్నారు. దీంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా చేర్పిస్తున్నారు. బోరబండ గవర్నమెంట్ హై స్కూల్​లో రెండువేల మందికి పైగా విద్యార్థులు ఉండగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని టీచర్లు భావిస్తున్నారు. ఫిలింనగర్ హైస్కూల్​లో 1,800 మంది విద్యార్థులు ఉండగా ఈసారి 2 వేలకు మించుతారని మేనేజ్​మెంట్​అంచనా వేస్తోంది. భోలక్ పూర్ లోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్​లో ఇప్పటికే అడ్మిషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం 200 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఇంగ్లీష్​మీడియంతోపాటు డిజిటల్ క్లాసులు చెబుతున్నారు.

చదువుతోపాటు ఒకేషనల్ కోర్సులు


ప్రస్తుతం స్కూల్​లో 265 మంది పిల్లలు ఉన్నారు. 400 మందికి పెంచాలని టార్గెట్ పెట్టుకున్నాం. మా స్కూల్ లో నార్మల్ క్లాసులతో పాటు డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నాం. పిల్లలకు ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా కుట్టు శిక్షణ ఇస్తున్నాం. గార్డెనింగ్​తో చక్కటి వాతావరణం మధ్య పాఠాలు చెబుతున్నాం. వ్యవసాయంపై ప్రత్యేకంగా వివరిస్తున్నాం. మా స్కూల్​లోని విద్యార్థులు ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు.


- ప్రతాప్ రెడ్డి, హెడ్ మాస్టర్, గడి హైస్కూల్ లాలపేట


జులై వరకు అడ్మిషన్లు జరుగుతాయి


మా స్కూల్​లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగుతోపాటు ఇంగ్లీష్​మీడియం కూడా ఉంది.1,800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం డైలీ నాలుగైదు అడ్మిషన్లు అవుతున్నాయి. జులై వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. విద్యార్థుల సంఖ్య 2వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నం. 


- శ్రీనివాస్ రెడ్డి, టీచర్, ఫిలింనగర్ హైస్కూల్


డిజిటల్ ​క్లాసులు చెప్తున్నం


ప్రతియేడు మా స్కూల్​లో అడ్మిషన్లు పెరుగుతూ వస్తున్నాయి. మంచుకొండ ఫౌండేషన్​ సాయంతో ఎల్​కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం అందిస్తున్నాం. మొత్తం16 క్లాస్ రూమ్‌‌లు ఉన్నాయి. డిజిటల్ పాఠాలు చెప్తున్నాం. ప్రస్తుతం 200 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా అడ్మిషన్లు వస్తున్నాయి. 


‌‌‌‌- మల్లికార్జున్, హెచ్ఎం, భోలక్ పూర్ ప్రైమరీ స్కూల్