
- ప్రైవేటు కాలేజీల్లో తగ్గిన24,805 మంది స్టూడెంట్లు
- వెల్లడించిన ఇంటర్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగిందని ఇంటర్మీడియెట్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3,292 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం 5,01,129 మంది ఫస్టియర్లో చేరిన్నట్లు తెలిపారు. ఇందులో సర్కారు జూనియర్ కాలేజీలు 430 ఉండగా..వాటిలో 92,117 మంది జాయిన్ అయ్యారని చెప్పారు. అంటే గతేడాదితో పోలిస్తే 8,482 ఎక్కువ అడ్మిషన్లు అయ్యాయి.
మరోపక్క గవర్నమెంట్ సెక్టార్ కాలేజీలు (గురుకులాలు, ఇతర) 1,512 ఉండగా.. వాటిలో 94,641 మంది చేరారు. ఈ కాలేజీల్లోనూ గతేడాదితో పోలిస్తే 6,846 మంది స్టూడెంట్లు పెరిగారు. అదేటైంలో 1,350 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయి. గతేడాది 3,39,176 మంది చేరగా.. ఈ ఏడాది 3,14,371 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. అంటే గతేడాదితో పోలిస్తే ఏకంగా 24805 అడ్మిషన్లు తగ్గాయి.
అడ్మిషన్లలో కొత్త ట్రెండ్..
ఏటా ప్రైవేట్ కళాశాలల్లోనే ఎక్కువగా అడ్మిషన్లు నమోదయ్యేవి. అయితే, ఈసారి మాత్రం ఈ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ప్రభుత్వ కాలేజీల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గు చూపినట్టు స్పష్టమవుతోంది. సర్కారు కాలేజీల్లో వసతుల కల్పన, కొత్తగా జూనియర్ లెక్చరర్లను నియమించడంతో పాటు ఫిజిక్స్ వాలా వంటి కార్పొరేట్ సంస్థలతో జేఈఈ, నీట్ కోచింగ్ ఇప్పిస్తుండటమే కారణమని అధికారులు చెప్తున్నారు.
మరోపక్క.. సర్కారు గురుకులాల్లోనూ క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు, క్వాలిటీ ఫుడ్ అందిస్తుండటంతో వాటివైపు పేరెంట్స్ మొగ్గు చూపారు. ప్రైవేటు కాలేజీల్లో భారీగా ఫీజుల వసూళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడి ప్రచారంతో ఆయా కాలేజీల్లో చేర్పించేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపించలేదని స్పష్టమవుతోంది. కాగా, సర్కారు కాలేజీల్లో మరింత వసతులతో పాటు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇంటర్మీడియెట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.