
హైదరాబాద్ : సర్కారు జూనియర్ కాలేజీల్లో స్టూడెంట్స్ ఎక్కువగా అడ్మిషన్లు తీసుకోవట్లేదు. నెలరోజుల్లో కేవలం 42,453 మంది మాత్రమే చేరారు. దీంతో ఇంటర్ అధికారుల్లో ఆందోళన నెల కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సగమైనా స్టూడెంట్లు అడ్మిషన్లు తీసుకుంటారో.. లేదో.. అనే అనుమానం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో 406 సర్కారు జూనియర్ కాలేజీల్లో జులై ఫస్ట్ నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 15 రోజుల కింద ఆన్లైన్ అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు చాన్స్ ఇచ్చింది. అయితే అంతకు ముందు మ్యానువల్‌గా తీసుకున్న అడ్మిషన్ల వివరాలను ఆన్లైన్ లో ఎంట్రీ చేశారు. ఈనెల 11 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కావాల్సి ఉన్నా, వరదల నేపథ్యంలో 18న ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అడ్మిషన్లు స్లోగా నడుస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42,453 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. దీంట్లో జనరల్ కోర్సుల్లో 34,168 స్టూడెంట్స్ ఉండగా, ఒకేషనల్ కోర్సుల్లో 8,335 స్టూడెంట్స్ ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 5వేల మంది వరకు చేరగా, మహబూబ్ నగర్లో 3వేలు, సంగారెడ్డి, నిజామాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో 2500 మంది చొప్పున అడ్మిషన్ పొందారు. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేవలం 150 స్టూడెంట్స్ మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారు. ములుగులో 390 మంది జాయిన్ అయ్యారు. సగం జిల్లాల్లో 1500 లోపే అడ్మిషన్లు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటి ఫలితాలు వచ్చిన తర్వాత మరింత మంది చేరే అవకాశముందని పేర్కొంటున్నారు.
పట్టించుకోని ఇంటర్ ఆఫీసర్లు..
ఇంటర్ అడ్మిషన్లపై ఆ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం రివ్యూ కూడా చేయట్లేదు. దీనికితోడు వరదలు, ఇంకా పుస్తకాలు రాకపోవడం, మిడ్ డే మీల్స్ హామీ అమలు కాకపోవడం వంటి అంశాలు అడ్మిషన్లు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. గతేడాది 1.10లక్షల మంది సర్కారు కాలేజీల్లో చేరగా, ఈసారి ఇప్పటి దాకా అందులో సగం స్టూడెంట్స్ కూడా చేరకపోవడంపై లెక్చరర్లలో అయోమయం నెలకొన్నది. అడ్మిషన్లు కూడా జిల్లా కేంద్రాలు, అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిగాయి. రూరల్ కాలేజీల్ల భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 10 వరకూ జరగనున్నాయి. దీంతో అడ్మిషన్ల ప్రాసెస్ పెద్దగా జరిగే చాన్స్ లేదు. ఇప్పటికైనా ఇంటర్ విద్యాశాఖ అధికారులు రెగ్యులర్, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్ల సహకారం తీసుకుని అడ్మిషన్లు నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.