
మీ పేస్ట్లో ఉప్పుందా.. అన్నట్లు మీ పాలల్లో పాలున్నాయా..? అనే పరిస్థితి వచ్చింది. అచ్చం పాల కంటే శ్రేష్టంగా.. తెల్లగా స్వచ్ఛమైన నురుగులతో కనిపించే పాలల్లో పాల శాతం ఎంత అంటే ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. హైదరాబాద్ లో విస్తరిస్తున్న కల్తీ దందా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోంది. నగరంలో కల్తీ పెద్ద మాఫియాలా తయారైంది. ఏం తిందామన్నా.. ఏం తాగుదామన్నా.. కల్తీ. చట్టానికి దొరకుండా కోట్ల వ్యాపారం చేస్తున్నారు కొందరు.
పొద్దున్నే లేస్తే టీ, కాఫీతో మొదలయ్యే నగర వాసి కల్తీ పాలకు బలైపోతున్నాడు. చిన్నపిల్లపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి ప్రాంతంలో కల్తీ పాల కహానీ వింటే పాలు తాగాలంటే భయపడే పరిస్థితి.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పర్వతాపూర్ లో కల్తీ పాల సెంటర్ పై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తో కల్తీ పాల తయారీకి పాల్పడుతున్నట్లు గుర్తించారు. కల్తీ పాలను తయారు చేస్తున్న గంగలపుడి మురళి కృష్ణ(50) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ALSO READ : Health alert: ఫ్రూట్ జ్యూస్ ఎక్కువుగా తాగుతున్నారా.. కేన్సర్ రావచ్చు.. బీ అలర్ట్
పర్వతాపూర్ లో కల్తీపాల సెంటర్ పై దాడిలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిర్వాహుల దగ్గర 110 లీటర్ల కల్తీ పాలు, 1.1 లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ , గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ 19 ప్యాకెట్లు (ఒక్కొక్కటి 1 కిలోలు), 50 పాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలు తయారు చేస్తున్న మురళి కృష్ణను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు మల్కాజిగిరి ఎస్ ఓటి పోలీసులు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.