
Advait Energy Shares: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు విజయ్ కేడియా, రేకా జున్ జున్ వాలా లాంటి ప్రముఖ ఇన్వెస్టర్లను వారి పోర్ట్ ఫోలియోను నిరంతరం పరిశీలిస్తుంటారు. చాలా మంది వారి పెట్టుబడులను అనుకరించాలని కూడా ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ విధానం లాభాలను తెచ్చిపెడుతుందని కొందరు ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. అందుకే వారు తమ వద్ద ఉండే తక్కువ మెుత్తాలను కూడా ఎక్కువ రాబడుల కోసం ఇలా చేస్తుంటారని తెలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రముక పెట్టుబడిదారుడు విజయ్ కేడియా ఇన్వెస్ట్మెంట్ గురించే. ఆయన తాజాగా స్మాల్ క్యాప్ కంపెనీ అయిన అద్వైత్ ఎనర్జీ కంపెనీ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. విజయ్ ఈ కంపెనీలో లక్ష షేర్లను కొనుగోలు చేసినట్లు బయటకు రావటంతో కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో ఏకంగా 20 శాతం పెరుగుదలను చూశాయి. ఆయన కంపెనీలో ఒక్కో షేరును రూ.1725 ధరకు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం స్టాక్ మాత్రం ఒక్కోటి రూ.1996 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
కంపెనీ షేర్లు గడచిన ఐదేళ్ల కాలంలో తన పెట్టుబడిదారులకు 7200 శాతం రాబడిని తెచ్చిపెట్టాయి. వాస్తవానికి 2020 అక్టోబర్ మెుదటి రోజున కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.25.68 స్థాయి వద్ద ఉండగా.. నేడు ఒక్కో షేరు ధర ఏకంగా రూ.వెయ్యి 996కి ఎగబాకింది. ప్రస్తుతం కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర రూ.వెయ్యి 020 వద్ద ఉండగా, స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2వేల 260గా ఉంది. అలాగే మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.11 కోట్లుగా నమోదు చేసింది.
ఇక కంపెనీ వ్యాపారం విషయానికి వస్తే అద్వైత్ ఎనర్జీ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇది పవర్ ట్రాన్స్మిషన్, సబ్-స్టేషన్లు, టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల కోసం ఉత్పత్తులతో పాటు ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్లను ఆఫర్ చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఈ పరిశ్రమ అవసరాల కోసం స్ట్రింగ్ టూల్స్, ACS వైర్ తయారీ, OPGW ఆపరేషన్స్, ERS, లైవ్ లైన్ ఇన్స్టాలేషన్లు అందిస్తోంది. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా కంపెనీ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.