అయినోళ్లకే సలహాదారు​ పోస్టులు

అయినోళ్లకే సలహాదారు​ పోస్టులు
  • రిటైర్మెంట్​ తర్వాత పెద్ద పోస్టులిస్తున్న సర్కారు
  • ప్రభుత్వ సలహాదారుల్లో ఏడుగురు రిటైర్​ అయినోళ్లే
  • ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జీతం, ఆఫీస్, స్టాఫ్​, కారు
  • అందుకోసం నెలకు రూ. కోటి దాకా ఖర్చు

హైదరాబాద్, వెలుగు: ఉన్నత స్థానాల్లో రిటైర్​ అవుతున్న తమ అనుకూల ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు పోస్టులు ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతున్నది. అడ్వయిజర్​ పోస్టులతో ప్రతి నెలా దాదాపు రూ. ఒక కోటి వరకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. వీరికి రూ. లక్షల్లో జీతాలు, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అడ్వయిజర్స్​ నుంచి ఏం సలహాలు వస్తున్నయో.. ప్రభుత్వం వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో పక్కన పెడితే.. వాళ్ల మనిషి అనుకుంటే చాలు రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక అడ్వయిజర్​ పోస్టు పక్కా అని ఐఏఎస్​ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.

ప్రస్తుత సలహాదారుల్లో..!
వివిధ పోస్టుల్లో రిటైర్​ అయినవాళ్లు ప్రస్తుతం ఏడుగురు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. చీఫ్​ సెక్రటరీగా రిటైర్​ అయిన రాజీవ్​ శర్మ  ప్రస్తుతం ముఖ్య సలహాదారుగా ఉన్నారు. 
సీఎస్​ హోదాలో పదవీ విరమణ పొందిన ఎస్​.కె. జోషి ప్రస్తుతం ఇరిగేషన్​ అడ్వయిజర్​గా ఉన్నారు. 2012లో రిటైర్​ అయిన కె.వి.రమణాచారి ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్​ అడ్వయిజర్ గా కొనసాగుతున్నారు. మొన్న పీసీసీఎఫ్​ హోదాలో పదవీ విరమణ చేసిన శోభను అదే రోజున అడ్వయిజర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ అనురాగ్​ శర్మ, రిటైర్డ్  ఐపీఎస్​ ఏకే ఖాన్​ కూడా సలహాదారులుగా కొనసాగుతున్నారు. ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​లో జీఆర్​ రెడ్డి అడ్వయిజర్‌‌గా కొనసాగుతున్నారు. రిటైర్డ్​ ఐఏఎస్​ శివశంకర్ స్పెషల్‌‌ ఆఫీసర్‌‌గా, రిటైర్డ్‌‌ ఐఏఎస్​ రామచంద్రుడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు.

ఆఫీస్​.. కారు.. ఇతరత్రా ఖర్చులు
ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవారికి స్పెషల్​గా ఆఫీస్​ సౌకర్యం కల్పించడంతో పాటు.. వెహికల్,  ముగ్గురు స్టాఫ్, ఇతర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఒక్కొక్కరికి జీతాలు రూ. 2 లక్షలపైనే ఉన్నట్లు తెలిసింది. ఇలా జీతాలు, ఇతర అవసరాలకు కలిపి నెలకు రూ. కోటి దాకా ఖర్చు అవుతుండగా.. ఏడాదికి రూ.12 కోట్లు అవుతున్నాయి. కొందరికి కేబినెట్​ హోదా కూడా సర్కార్​ కల్పించింది. ఏపీలో ఎక్కువ మంది అడ్వయిజర్లు ఉండటంపై గతంలో అక్కడి హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది. కొందరు అడ్వయిజర్లకు ఉన్న స్పెషల్​ ఫెసిలిటీస్​ న్యాయమూర్తులకు కూడా లేవని వ్యాఖ్యానించింది. అచ్చం అట్లనే తెలంగాణలో కొందరు ప్రభుత్వ సలహాదారుల తీరు ఉందని ఉన్నత హోదాలో ఉన్న కొందరు ఐఏఎస్​ ఆఫీసర్లు చెప్తున్నారు. వెయిటింగ్​ పోస్టు తీయాలన్నా.. ఏదైనా డిపార్ట్​మెంట్​కు వెళ్లాలనే ఇష్టాన్ని వ్యక్తపరచాలనుకున్నా రాష్ట్ర చీఫ్​ అడ్వయిజర్ గా​ ఉన్న రిటైర్డ్​ ఆఫీసర్​ దగ్గర చెప్పుకుంటే చాలు.. పని అయిపోతుందనే చర్చ జరుగుతున్నది.

మనోళ్లు కాదు అనుకుంటే మధ్యలోనే..
ప్రభుత్వానికి  కాస్త అనుకూలంగా అనిపియ్యకపోయినా.. ఆ ఐఏఎస్​, ఐపీఎస్​ ఆఫీసర్​ మధ్యలోనే రాజీనామా చేసి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇందులో ఆకునూరి మురళి, ఆర్.ఎస్. ప్రవీణ్​ కుమార్, వీకే సింగ్​లాంటి వాళ్లు ఉన్నారు. ఇక గతంలో సీఎస్​గా నియమితులైన రెండు నెలలకే ప్రదీప్​ చంద్ర రిటైర్​ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు సీఎస్​ హోదాలో ఉన్న ఐఏఎస్​లకు ఎక్స్​టెన్షన్​ ఇచ్చిన సర్కార్.. ప్రదీప్​ చంద్ర అనుకూలంగా లేకపోవడంతోనే అలా చేసిందని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పటికీ కొంతమంది సీనియర్​ ఐఏఎస్​లకు లూప్​ పోస్టులు ఇచ్చి, అనుకూలంగా ఉన్నవారికి మంచి డిపార్ట్​మెంట్లను కేటాయించడంతో పాటు మూడు, నాలుగు శాఖల బాధ్యతలను అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.