కారుతో అడ్డగించి.. కత్తులతో పొడిచి

కారుతో అడ్డగించి.. కత్తులతో పొడిచి
  • కారుతో అడ్డగించి.. కత్తులతో పొడిచి..అడ్వకేట్‌‌‌‌ హత్య
  • ములుగు జిల్లా పందికుంట వద్ద ప్రత్యర్థుల దాడి 
  • 30 ఏళ్లుగా మైనింగ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లో మల్లారెడ్డి
  • మైనింగ్‌‌‌‌ మాఫియా చేతిలో మర్డర్​?   

ములుగు/జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు:  వరంగల్‌‌, ములుగు కోర్టుల్లో అడ్వకేట్‌‌గా ప్రాక్టీస్ చేస్తున్న ములగుండ్ల మల్లారెడ్డి(65) దారుణ హత్యకు గురయ్యారు. మైనింగ్ మాఫియాకు చెందిన వ్యక్తులు ఆయనను కారుతో అడ్డగించి.. అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. ములుగు నుంచి సోమవారం సాయంత్రం హన్మకొండలోని ఇంటికి మల్లారెడ్డి వెళ్తుండగా.. ములుగు జిల్లాకేంద్రానికి అతి సమీపంలో పందికుంట స్టేజీ వద్ద 163 నేషనల్‌‌ హైవేపైనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మల్లారెడ్డి స్వస్థలం జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా రేగొండ. అడ్వకేట్ గా పని చేస్తూనే మైనింగ్ బిజినెస్ కూడా చేసేవారు. ములుగు మండలం మల్లంపల్లి వద్ద ఆయనకు ఎర్రమట్టి క్వారీ, ఓ పెట్రోల్ బంకు ఉంది.  వరంగల్‌‌ బార్‌‌ అసోసియేషన్‌‌ వైస్‌‌ ప్రెసిడెండ్‌‌గా కూడా పనిచేశారు. 

మైనింగ్‌‌ మాఫియా పనే? 
ములుగు నుంచి మల్లంపల్లి వైపు ఇన్నోవా వాహనంలో మల్లారెడ్డి వెళ్తుండగా ఐదుగురు దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చి అటకాయించారు. ఇద్దరు వ్యక్తులు డ్రైవర్‌ను కిందికి దించి మాట్లాడుతుండగా.. మరో ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్న మల్లారెడ్డిని చెట్ల పొదలవైపు లాక్కెళ్లారు. అక్కడ మల్లారెడ్డిని కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఆ తర్వాత వచ్చిన కారులోనే పారిపోయారు. మల్లారెడ్డి హత్య వెనుక మైనింగ్‌‌ మాఫియా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీ విషయంలో మల్లారెడ్డికి గతంలోనే ప్రత్యర్థుల నుంచి వార్నింగ్‌‌లు వచ్చాయి. గతంలో మావోయిస్టుల హిట్‌‌ లిస్ట్‌‌లో కూడా ఉన్నారు. అనేక భూ వివాదాలలోనూ ఈయన పేరు వినిపించింది. హత్య వెనక భూవివాదాల కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అడ్వకేట్‌‌ మల్లారెడ్డిని చంపిన వాళ్లను పోలీసులు వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని వరంగల్‌‌ బార్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షుడు ఆనంద్‌‌ మోహన్‌‌ డిమాండ్‌‌ చేశారు. మల్లారెడ్డి హత్యకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో లాయర్లు, అడ్వకేట్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపేలా సూచనలు ఇవ్వాలని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ. నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేసినట్లుగా తెలిపారు.