
హైదరాబాద్: అడ్వకేట్ వామనరావు దంపతుల మర్డర్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వామనరావు దంపతుల హత్య కేసును సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు కేసును సీబీఐకి ట్రాన్స్ఫర్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
2021, ఫిబ్రవరి 17న వామనరావు దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కారులో వెళ్తుండగా మంథని హైవే పై కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు దుండగులు. వామనరావు దంపతుల మర్డర్ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పుట్ట మథు తన మనుషులతో హత్య చేయించాడని వామనరావు బంధులు ఆరోపించారు.
ఈ క్రమంలో అడ్వకేట్ దంపతులు వామనరావు, గట్టు నాగమణి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మృతుడి తండ్రి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అంశంపై వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. వామనరావు దంపతుల హత్య కేసులో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత పుట్టా మధు పోలీసులను ప్రభావితం చేశారని, పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందు ఉంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. వామనరావు మరణ వాంగ్మూలం వీడియోకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
అలాగే, వామనరావు దంపతుల కేసును సీబీఐకి అప్పగించడంలో తమకేలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. వామనరావు దంపతుల మర్డర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీ చేయడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందని ఉత్కంఠగా మారింది.