Rashid Khan: మనం మనం ఒకటే.. భారత్ కోసం పాకిస్తాన్‌కు షాకిచ్చిన రషీద్ ఖాన్

Rashid Khan: మనం మనం ఒకటే.. భారత్ కోసం పాకిస్తాన్‌కు షాకిచ్చిన రషీద్ ఖాన్

అఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్) నుంచి తప్పుకున్నాడు. ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న పీఎస్‌ఎల్ టోర్నీకి తాను అందుబాటులో ఉండట్లేదని ప్రకటించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ధృవీకరించింది.

వన్డే వరల్డ్ కప్ అనంతరం రషీద్ ఖాన్ వెన్నుగాయంతో బాధపడ్డాడు. ఆపై శస్త్రచికిత్స చేయించుకోగా.. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ సూపర్ లీగ్ నుంచి రషీద్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ ఆఫ్ఘన్ స్టార్ పీఎస్‌ఎల్ టోర్నీలో లాహోర్ క్వాలండర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత మూడు సీజన్లుగా క్వాలండర్స్ తరపున ఆడుతున్న రషీద్.. ఆ జట్టు 2022, 2023లో టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలాంటి కీలక ఆటగాడు రాబోవు సీజన్‌‌కు అందుబాటులో లేకపోవడం లాహోర్ జట్టుకు లోటుగా మారుతోంది.

ఐపీఎల్ కోసమే..!

పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌ ఫిబ్రవరి 18న ప్రారంభమై మర్చి 18న ముగియనుంది. ఇదిలావుంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ కోసమే రషీద్, పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. పాక్ లీగ్ కంటే ఐపీఎల్‌లో తన ఆట, అనుభవంతో ఎక్కువగా సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో అతను పాకిస్తాన్‌కు  నో చెప్పినట్లు కథనాలు ప్రచారం అవుతున్నాయి. నెటిజెన్స్ సైతం అదే కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమయ్యే సమయానికి అతను గాయం నుంచి కోలుకోకపోతే, గుజరాత్‌కు దెబ్బే. ఈ క్రమంలో అతను వచ్చే నెల ఐర్లాండ్‌తో జరగనున్న సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా! లేదా అనేది మరో ప్రశ్న. దుబాయ్ వేదికగా అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది.