అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ అరాచకాలు, యుద్ధ వాతావరణం కారణంగా జరిగిన ఘోరాలతో అక్కడి ప్రజలు అనుభవించిన బాధలకు ప్రత్యక్ష నిదర్శనంలా నిలిచిందామె. అంతర్జాతీయ సమాజానికి అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టిన ‘అఫ్గాన్ గర్ల్’గా ఫేమస్ అయిందామె. ఆమె పేరే షర్బత్ గుల్లా. మరోసారి అఫ్గాన్‌లో తాలిబాన్ రాజ్యం రావడంతో ప్రాణ రక్షణ కోసం ఈమె ఆ దేశం నుంచి బయటపడేందుకు ఎన్నో అవస్థలు పడింది. చివరికి ఇటలీ ప్రభుత్వ సాయంతో ఆ దేశం చేరుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇటలీ ప్రధాని కార్యాలయం గురువారం ప్రకటించింది. గుల్లా ప్రస్తుతం ఇటలీ రాజధాని రోమ్‌లో ఉందని, ఆమె ఇక్కడి జీవన శైలికి అలవాటు పడేందుకు సహకరిస్తామని పేర్కొంది.
నేషనల్ జియోగ్రఫీ కవర్ పేజీపై..
అఫ్గాన్‌లో తాలిబాన్ల అధికార దాహంతో ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడి ప్రజల జీవితాలు అస్థవ్యస్తమయ్యాయి. సామాన్య ప్రజలు, మహిళలపై అరాచకాలు ఎక్కువయ్యాయి. యుద్ధ బీభత్సం మధ్య ప్రజలు దీనస్థితిలో బతుకీడ్చారు. చాలా మంది శరణార్థులుగా క్యాంపుల్లో బతకాల్సి వచ్చింది. ఆ సమయంల్లో అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టేలా షర్బత్ గుల్లా ఫొటోను తీశాడు వార్ ఫొటోగ్రాఫర్ స్టీవ్ మెక్‌కరీ. 1984లో నేషనల్ జియోగ్రఫీ మ్యాగజీన్ కవర్ పేజీపై ఆ ఫొటో పబ్లిష్ అయింది. దీంతో అఫ్గాన్‌లో యుద్ధ వాతావరణం కారణంగా శరణార్థులు ఎంతటి దీనావస్థను ఎదుర్కొంటున్నారో ప్రపంచమంతా తెలిసింది. అయితే ఆ తర్వాత అఫ్గాన్ పూర్తిగా తాలిబాన్ల గుప్పిట్లోకి వెళ్లిపోవడంతో షర్బత్ తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పాకిస్థాన్ పారిపోయింది. అయితే అక్కడ ఆమె ఫేక్ పాకిస్థానీ ఐడీ కార్డు కొనుక్కుంటూ దొరికిందని 2014లో అఫ్గాన్‌కు డీపోర్ట్ చేశారు. అయితే ఆ తర్వాత షర్బత్ గుల్లాను అమెరికా అండతో అఫ్గాన్‌లో నడుస్తున్న ప్రభుత్వం కాబూల్ తీసుకొచ్చి, ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో సత్కరించారు. ప్రెసిడెంట్ ఆమెకు ఒక అపార్ట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 15న మళ్లీ అఫ్గాన్‌ను తాలిబాన్లు తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడంతో మహిళలపై అరాచకాలు ఎక్కువయ్యాయి. దీంతో లక్షలాది మంది ఆ దేశం విడిచి విదేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. షర్బత్ గుల్లా కూడా తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తాలిబాన్లకు దొరక్కుండా దాగి ఉండి, అఫ్గాన్ నుంచి బయటపడేందుకు యత్నించింది. శరణార్థుల తరలింపు చేపడుతున్న సంస్థల సాయంతో ఇటలీకి వెళ్లేందుకు సాయం కోరింది. దీంతో గురువారం ఆమెను ఇటలీ ప్రభుత్వం రోమ్‌కు చేర్చింది.
