ఇంట్ల సామాన్లు అమ్ముకుంటున్న అఫ్గాన్ ప్రజలు

ఇంట్ల సామాన్లు అమ్ముకుంటున్న అఫ్గాన్ ప్రజలు
  • తాలిబాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పాలనలో జనం ఆగమాగం
  • చుక్కలనంటిన ధరలు.. పెరిగిన నిరుద్యోగం 
  • పేదరికం 97 శాతానికి పెరగొచ్చంటున్న ఎక్స్​పర్ట్స్​

వాషింగ్టన్: తాలిబాన్లు అఫ్గానిస్తాన్​​ను చేజిక్కించుకున్నాక పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం (ఇన్ ఫ్లేషన్) పెరగడంతో ఇల్లు గడవక జనం అల్లాడుతున్నారు. చాలా మంది ఇంట్లో ఉండే సామాన్లు, విలువైన వస్తువులను రోడ్ల మీద పెట్టి అమ్ముకుంటున్నారు. ఫ్రిజ్​లు, కార్పెట్​లు, టీవీలు, కప్ బోర్డులు, సోఫాలతో కాబూల్ రోడ్లన్నీ మార్కెట్లలా కనిపిస్తున్నాయి. ‘నేను ఫ్రిజ్​ను రూ. 25 వేలకు కొన్నా. కానీ రూ. 5 వేలకు అమ్మేశా. ఏం చేయమంటారు మరి? నా పిల్లలకు తిండి పెట్టాలి’ అని కాబూల్​లో ఓ దుకాణ యజమాని లాల్ గుల్ చెప్పాడు. కాబూల్​లో పోలీస్​ ఆఫీసర్​గా పని చేసిన ఓ వ్యక్తి మార్కెట్​లో పని చేస్తున్నాడు. ‘నాకు జీతం ఇవ్వలేదు. బతకడానికి ఏదో ఓ పని చేసుకోవాలిగా’ అని ఆయన చెప్పాడు. తాలిబాన్లు అధికారంలోకి రాకముందు దేశంలో 72 శాతమున్న పేదరికం ఇప్పుడు 97 శాతానికి పెరిగిందని ఐక్యరాజ్యసమితి ఇదివరకే తెలిపింది. దేశంలో మున్ముందు తిండి దొరకడం కష్టమవుతుందని, జనం ఆకలితో చనిపోయే పరిస్థితి రావొచ్చని ఎక్స్​పర్ట్స్​ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆగిపోయిన విదేశీ సాయం
తాలిబాన్లు ఆగస్టు 15న అఫ్గాన్​ను తమ అధీనంలోకి తీసుకున్నాక పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయి. తాలిబాన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి విదేశాలు రెగ్యులర్​గా ఇచ్చే  సాయాన్ని నిలిపేశాయి. అమెరికా రూ. 69 వేల కోట్లను అఫ్గాన్​ సెంట్రల్​ బ్యాంకుకు ఆపేసింది. చాలా వరకు ఎకనమిక్​ యాక్టివిటీ స్తంభించిపోయింది. సాధారణ, అత్యవసర సేవలన్నీ ఆగిపోయాయి. బ్యాంకు సేవలూ నిలిచిపోయాయి. దీంతో అఫ్గాన్​లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదిరకం పెరిగాయి. అఫ్గాన్​ తాలిబాన్ల చేతిలోకి రాకముందే  దేశ జనాభాలో సగం(1.8కోట్లు) మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారని ఐక్యరాజ్యసమితి హై కమిషనర్​ ఫర్​ రెఫ్యూజీస్​ ఫిలిప్పో చెప్పారు.

అంత వరకూ చర్చలుండవ్: ఐఎంఎఫ్​
అఫ్గాన్​లో తాలిబాన్​ సర్కారు గుర్తింపుకు సంబంధించి అంతర్జాతీయంగా క్లారిటీ వచ్చే దాకా ఆ దేశంతో చర్చలు ఉండవని ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్) వెల్లడించింది.