వరల్డ్‌‌ కప్‌‌లో అఫ్గానిస్తాన్‌‌ సంచలన విజయం

వరల్డ్‌‌ కప్‌‌లో అఫ్గానిస్తాన్‌‌ సంచలన విజయం
  •     చెలరేగిన గుర్బాజ్‌‌, ఇక్రామ్‌‌, రషీద్‌‌, ముజీబ్‌‌
  •     బ్రూక్‌‌ హాఫ్‌‌ సెంచరీ వృథా


న్యూఢిల్లీ: వరల్డ్‌‌ కప్‌‌లో సెంచలనం. అండర్‌‌ డాగ్స్‌‌గా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌‌.. తమ క్రికెట్‌‌ హిస్టరీలో గుర్తుండిపోయే విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చూపెడుతూ.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 69 రన్స్‌‌ తేడాతో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ఇంగ్లండ్‌‌కు ఊహించని షాకిచ్చింది. అఫ్గాన్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ చరిత్రలో ఇది రెండో విజయం. 2015 టోర్నీలో స్కాట్లాండ్‌‌పై నెగ్గిన అఫ్గాన్‌‌ ఆ తర్వాత మెగా ఈవెంట్‌‌లో ఆడిన 14 మ్యాచ్‌‌ల్లోనూ ఓటమిపాలైంది. ఇక స్పిన్నర్ల చేతిలో 8 వికెట్లు కోల్పోయి వరల్డ్‌‌ కప్‌‌ మ్యాచ్‌‌ ఓడటం ఇంగ్లండ్‌‌కు ఇదే తొలిసారి.

టాస్‌‌ ఓడిన అఫ్గానిస్తాన్‌‌ 49.5 ఓవర్లలో 284 రన్స్‌‌కు ఆలౌటైంది. రహమానుల్లా గుర్బాజ్‌‌ (57 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 80), ఇక్రామ్‌‌ అలీఖిల్‌‌ (66 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 58) హాఫ్‌‌ సెంచరీలతో రాణించారు. తర్వాత ఇంగ్లండ్‌‌ 40.3 ఓవర్లలో 215 రన్స్‌‌కే పరిమితమైంది. హ్యారీ బ్రూక్‌‌ (66) టాప్‌‌ స్కోరర్‌‌. ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ ముజీబ్‌‌, రషీద్‌‌ ఖాన్‌‌ చెరో మూడు, నబీ రెండు వికెట్లతో ఇంగ్లీష్‌‌ లైనప్‌‌ను కూల్చారు. 

గుర్బాజ్‌‌ జోరు..

ఫ్లాట్‌‌ వికెట్‌‌పై అఫ్గాన్‌‌ ఓపెనర్‌‌ గుర్బాజ్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిస్తే, మధ్యలో వచ్చిన ఇక్రామ్‌‌ అలీఖిల్‌‌ ఇన్నింగ్స్‌‌కు మంచి ఫినిషింగ్‌‌ ఇచ్చాడు. పవర్‌‌ ప్లే మొత్తం కవర్స్‌‌, ఆఫ్‌‌, ఆన్‌‌ సైడ్‌‌లో కళ్లు చెదిరే షాట్స్‌‌తో అలరించిన గుర్బాజ్‌‌ 33 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌లో ఇబ్రహీం జద్రాన్ (28) పెద్దగా ప్రభావం చూపకపోయినా గుర్బాజ్‌‌ అన్ని తానై ఇన్నింగ్స్‌‌ నడిపించాడు. ఫలితంగా పవర్‌‌ ప్లేలో అఫ్గాన్‌‌ 79/0 స్కోరు చేసింది. గుర్బాజ్‌‌ను కట్టడి చేసేందుకు 11వ ఓవర్‌‌లోనే ఆదిల్‌‌ రషీద్‌‌ (3/42)ను తీసుకొచ్చినా ఫలించలేదు.

దాదాపు ఆరు ఓవర్లు మళ్లీ గుర్బాజ్‌‌ ఆటే సాగింది. అయితే 17వ ఓవర్‌‌లో రషీద్‌‌.. జద్రాన్‌‌ను ఔట్‌‌ చేసి తొలి వికెట్‌‌కు 114 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. అసలు ఫలితం మాత్రం ఇంగ్లండ్‌‌కు 19వ ఓవర్‌‌లో కనిపించింది. రషీద్‌‌ వేసిన ఈ ఓవర్‌‌ నాలుగో బాల్‌‌కు రహమత్‌‌ షా (3) ఔట్‌‌ కాగా, తర్వాతి బాల్‌‌కు గుర్బాజ్‌‌ రనౌటయ్యాడు. దీంతో అఫ్గాన్‌‌ స్కోరు 122/3గా మారింది. హష్మతుల్లా షాహిది (14), అజ్మతుల్లా ఒమర్‌‌జాయ్‌‌ (19), మహ్మద్‌‌ నబీ (9) నిరాశపర్చినా ఇక్రామ్‌‌ అలీఖిల్‌‌ నిలకడగా ఆడాడు. 190/6తో ఉన్న స్కోరును క్రమంగా పెంచుకుంటూ వెళ్లాడు. రషీద్‌‌ ఖాన్‌‌ (23)తో ఏడో వికెట్‌‌కు 43, ముజీబర్‌‌ రెహమాన్‌‌ (28)తో ఎనిమిదో వికెట్‌‌కు 44 రన్స్‌‌ జత చేయడంతో స్కోరు 277/8 అయ్యింది. చివర్లో 10 బాల్స్‌‌ తేడాలో ముజీబ్‌‌, నవీన్‌‌ ఉల్‌‌ హక్‌‌ (5) వెనుదిరగడంతో అఫ్గాన్‌‌ పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. మార్క్‌‌ వుడ్‌‌ 2 వికెట్లు తీశాడు. 

ఒక్కడు మాత్రమే..

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇంగ్లండ్‌‌ను అఫ్గాన్‌‌ స్పిన్నర్లు అద్భుతంగా నిలువరించారు. స్టార్టింగ్‌‌లో పేసర్లు రెండు వికెట్లు తీసి స్ట్రయిక్‌‌ ఇస్తే స్పిన్నర్లు ఎనిమిది వికెట్లు తీసి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఒక్క బ్రూక్‌‌ మినహా మిగతా వారు ఘోరంగా ఫెయిలయ్యారు. రెండో ఓవర్‌‌లో తొలి బాల్‌‌కే బెయిర్‌‌ స్టో (2), ఏడో ఓవర్‌‌లో రూట్‌‌ (11) ఔట్‌‌ కావడంతో ఇంగ్లండ్‌‌ 33/2తో కష్టాల్లో పడింది.

ఈ దశలో మలన్‌‌ (32), బ్రూక్‌‌ మూడో వికెట్‌‌కు 35 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ 13వ ఓవర్‌‌లో మలన్‌‌ ఔట్‌‌ కావడంతో ఇంగ్లండ్‌‌కు గట్టి దెబ్బ తగిలింది. రషీద్‌‌, ముజీబ్‌‌, నబీ ముప్పేటా చేసిన స్పిన్‌‌ దాడుల్లో ఇంగ్లీష్‌‌ బ్యాటర్లు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. చివర్లో ఆదిల్‌‌ రషీద్‌‌ (22) కాసేపు ప్రతిఘటించినా అప్పటికే మ్యాచ్‌‌ చేజారింది. బట్లర్‌‌ (9), లివింగ్‌‌స్టోన్‌‌ (10), సామ్‌‌ కరన్‌‌ (10), క్రిస్‌‌ వోక్స్‌‌ (9), మార్క్‌‌ వుడ్‌‌ (18), రీస్‌‌ టోప్లీ (15 నాటౌట్‌‌) తో సహా అందరూ విఫలమయ్యారు.

సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్‌‌: 49.5 ఓవర్లలో 284 ఆలౌట్‌‌ (రహమానుల్లా గుర్బాజ్‌‌ 80, ఇక్రామ్‌‌ 58, ఆదిల్‌‌ రషీద్‌‌ 3/42), ఇంగ్లండ్‌‌: 40.3 ఓవర్లలో 215 ఆలౌట్‌‌ (బ్రూక్‌‌ 66, మలన్‌‌ 32, రషీద్‌‌ 3/37, ముజీబ్‌‌ 3/51).