తాలిబాన్లపై మర్లవడ్తున్న అఫ్గాన్లు 

తాలిబాన్లపై మర్లవడ్తున్న అఫ్గాన్లు 

అఫ్గానిస్తాన్​ను ఆక్రమించుకున్న తాలిబాన్లపై జలాలాబాద్​లో యువకులు​ మర్లవడ్డరు. తాలిబాన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిటీలో పలుచోట్ల తాలిబాన్లు పెట్టిన జెండాలను తీసేసి అఫ్గాన్​ జాతీయ జెండాను ఎగరేశారు. మండిపడ్డ తాలిబాన్లు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోయారు. మరోవైపు అఫ్గాన్​ పాలనను కౌన్సిల్​ చూసుకుంటుందని, దానిపై ఓవరాల్​గా తమ సుప్రీం లీడర్​ హైబతుల్లా పర్యవేక్షణ చేస్తారని తాలిబాన్లు ప్రకటించారు.

కాబూల్: ‘‘నా కోసం తాలిబాన్ల వస్తున్నారు. ప్లీజ్.. నన్ను కాపాడండి. మీ విమానంలో తీస్కపోండి..” ఓ యువతి కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఇనుప కంచెలకు ఆవల నిలబడి అమెరికా సైనికులను వేడుకుంటున్న దృశ్యమిది. ‘‘యాడికి పోవాల్నో తెలవదు. కానీ ఈ దేశంలో మాత్రం ఉండను. ఏ విమానం దొరికితే అది ఎక్కి పోదామని వచ్చిన. కానీ గంటల తరబడి ఎదురుచూస్తున్నా.. విమానం మాత్రం ఎక్కనిస్తలేరు..” ఎయిర్ పోర్టు ముంగట ఓ మహిళ దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ చెప్తున్న మాటలివి. వీళ్లిద్దరు మాత్రమే కాదు.. ఎట్లన్నా సరే.. దేశం దాటిపోదామని కాబూల్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సుమారు 50 వేల మంది అఫ్గాన్ ప్రజలు పడుతున్న గోస ఇది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రెఫ్యూజీలను తమ దేశానికి తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నా.. కాబూల్ ఎయిర్ పోర్టును తాలిబాన్ లు పూర్తిగా మూసివేసి, ఇనుప కంచెలు వేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వాళ్లను చితకబాదుతున్నరు. మహిళలు, పిల్లలనూ చావబాదుతున్నరు. గుంపును చెదరగొట్టేందుకు కాల్పులు కూడా జరుపుతున్నారు. దీంతో మంగళవారం జర్మనీకి చెందిన ఎయిర్ బస్ విమానంలో 150 మందికి చోటు ఉన్నా.. కేవలం ఏడుగురితోనే బయలుదేరింది. బుధవారం ఆస్ట్రేలియాకు చెందిన విమానంలో 120 మంది వెళ్లేందుకు అవకాశం ఉన్నా.. 26 మందితోనే టేకాఫ్ అయింది. అయితే కాబూల్ నుంచి రెఫ్యూజీల తరలింపును అడ్డుకుంటే తమ ఆర్మీని దింపాల్సి ఉంటుందంటూ తాలిబాన్ లను యూఎస్ జనరల్ ఫ్రాంక్ మెక్ కెంజీ హెచ్చరించారు.  
కర్జాయ్​తో తాలిబాన్ నేతల చర్చలు 
అఫ్గానిస్తాన్​లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబాన్ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. బుధవారం కాబూల్ లో అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో పాటు నేషనల్ రీకాన్సిలియేషన్ కౌన్సిల్ చీఫ్, ప్రభుత్వ శాంతి దూత అబ్దుల్లా అబ్దుల్లాతో తాలిబాన్ సీనియర్ కమాండర్ ఒకరు, హక్కానీ నెట్ వర్క్ మిలిటెంట్ గ్రూపు నేత ఆనస్ హక్కానీ చర్చలు జరిపారు. కొత్త ప్రభుత్వంలో తాలిబాన్ యేతర నేతలు కూడా ఉండేలా చర్చలు జరుగుతున్నట్లు తాలిబాన్ వర్గాలు తెలిపాయి. తాలిబాన్ లు ఈ నెల 15న అఫ్గాన్ రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచీ కర్జాయ్, అబ్దుల్లాతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారు. తాలిబాన్ సీనియర్ నేత అమీర్ ఖాన్ ముత్తకీ ఇదివరకే పలు రౌండ్లు చర్చలు జరిపారు. కొత్త ప్రభుత్వం అందరినీ కలుపుకుని పోయేలా ఉంటుందని తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఇదివరకే ప్రకటించారు. కాగా, తాలిబాన్ గ్రూపులో హక్కానీ నెట్ వర్క్ కూడా ఒక పార్ట్ నర్ గా కొనసాగుతూ వస్తోంది. ప్రధానంగా పాక్ బార్డర్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న హక్కానీ నెట్ వర్క్ కొన్నేళ్లుగా అఫ్గానిస్తాన్​లో భారీ దాడులకు తెగబడింది.  

తాలిబాన్‌‌‌‌ల కాల్పుల్లో ముగ్గురు మృతి 
అఫ్గాన్ లోని జలాలాబాద్ సిటీలో బుధవారం జరిగిన నిరసన ర్యాలీపై తాలిబాన్‌లు కాల్పులు జరిపారు. సిటీలోని ఓ చౌరస్తాలో తాలిబాన్‌ల జెండాను తీసేసి, అఫ్గాన్ జెండాను పెట్టేందుకు స్థానిక నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో జనంపైకి తాలిబాన్‌లు కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు. మరో డజను మందికి పైగా కాల్పుల్లో గాయపడ్డారు. ఈ ఘటనపై తాలిబాన్ లు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.  

యూఏఈలో అష్రఫ్​ ఘని
అఫ్గానిస్తాన్ నుంచి కుటుంబంతో సహా పారిపోయిన ప్రెసిడెంట్ అష్రఫ్​ఘని యుఏఈకి చేరుకున్నారు. ఘనితో పాటు ఆయన కుటుంబానికి మానవతా దృక్ఫథంతో తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతించినట్లు బుధవారం యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఘని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపింది.

టెర్రరిస్ట్ నేత, శాంతి దూత.. బరాదర్!
అఫ్గాన్​లో తాలిబాన్లు ఏర్పాటు చేసే సర్కార్​లో ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ దేశ కొత్త ప్రెసిడెంట్​గా బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. బరాదర్​ ఒక టెర్రరిస్ట్ నేత మాత్రమే కాదు.. టెర్రరిస్టులకు, అఫ్గాన్, అమెరికా ప్రభుత్వాలకు మధ్య శాంతి చర్చలకు ప్రధాన ప్రతినిధి కూడా. కొత్త సర్కార్ ఏర్పాటు కోసం కొన్ని నెలలుగా దోహాలో అమెరికా, అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చల్లో కీలక పాత్ర పోషించిన బరాదర్ ఇప్పుడు ఖతర్ నుంచి అఫ్గానిస్తాన్​కు చేరుకున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు సంబంధించి 2004, 2009 లో జరిగిన శాంతి చర్చలలో బరాదర్ కీలక పాత్ర పోషించారు.