తాలిబాన్​ నీడలోభయం.. భయంగా

తాలిబాన్​ నీడలోభయం.. భయంగా
  • గత అరాచకాలను గుర్తుతెచ్చుకుని వణుకుతున్న అఫ్గాన్లు
  • ఇండ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి
  • కాబూల్ నగర దారులన్నీ తాలిబాన్ల అధీనంలోకి
  • మిలిటెంట్ల పెట్రోలింగ్.. జైళ్లలోని ఖైదీల విడుదల
  • నివురుగప్పిన నిప్పులా అఫ్గాన్ రాజధాని కాబూల్​
  • ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనన్న అమ్రుల్లా సలే

ఇది రైల్వే కంపార్ట్​మెంట్​ కాదు.. అఫ్గానిస్తాన్​ జనంతో నిండిన అమెరికా విమానం. తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తోచిన దిక్కుకల్లా పారిపోతున్నారు. కాబూల్​ ఎయిర్​పోర్టు రెండు రోజులుగా జనంతో కిక్కిరిసిపోతోంది. ఏ ఫ్లైట్​ బయల్దేరితే ఆ ఫ్లైట్​లోకి​వందలాదిగా దూరిపోతున్నారు. ఓ అమెరికా విమానం బయల్దే రేందుకు రెడీ కావడంతో సిబ్బందిని తోసుకుంటూ 640 మంది ఎక్కేసి ఇలా కూర్చుండిపోయారు. ఆ విమానం ఏ దేశం వెళ్తుందన్నది ముఖ్యం కాదు.. అఫ్గాన్​ నుంచి బయటపడ్డామా.. లేదా అన్నదే వీరికి ముఖ్యం. పాకిస్తాన్​ బార్డర్​లోనూ వేలాది మంది దేశం దాటేందుకు ఎదురుచూస్తున్నారు.


కాబూల్ / న్యూఢిల్లీ: కాపాడాల్సిన పాలకుడు పారిపోయాడు.. రక్షిస్తారనుకున్న సైనికులు చేతులెత్తేశారు.. 20 ఏళ్లు అండగా ఉన్న అమెరికన్లు మధ్యలోనే వదిలేసి తమ దారి తాము చూసుకున్నారు. అఫ్గానిస్తాన్ పూర్తిగా తాలిబాన్ చెర చిక్కింది. ఈ పరిస్థితుల్లో గత అరాచకాలను గుర్తుతెచ్చుకుని జనం వణికిపోతున్నారు. భయంతో వేలాది మంది కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు పరుగులు తీస్తే.. పిల్లా జెల్లను వదల్లేని వాళ్లు తమ ఇండ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. ‘మేం ఎవ్వరినీ ఏం చేయం’ అని తాలిబాన్లు చెబుతున్నా.. అఫ్గాన్లు నమ్మడం లేదు. ఎందుకంటే 20 ఏండ్ల కిందటి పరిస్థితి వాళ్ల ముందు కదలాడుతోంది.

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నగరం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ ఉగ్రవాదుల అధీనంలోకి వెళ్లిపోయాయి. విమానాశ్రమం తప్ప.. మిగతా ఎక్కడ చూసిన తాలిబన్లే. అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో తాలిబాన్ల పెట్రోలింగ్ కొనసాగుతోంది. అయితే గతంలో మాదిరి ఎలాంటి హింస చెలరేగలేదు.. గన్ ఫైట్ జరగలేదు. కానీ జైళ్లలోని ఖైదీలను తాలిబాన్లు విడిపించారు. ఆయుధాలన్నింటినీ ఎత్తుకెళ్లారు. దీంతో ప్రజలు తమ ఇండ్లలో బిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు. ఎప్పుడు, ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. అఫ్గాన్ ప్రభుత్వం, లేదా విదేశాల కోసం పని చేసిన వారిపై తాము ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబాన్ నేతలు ప్రకటిస్తూనే.. కాబూల్ లో ప్రభుత్వానికి సహాయం చేసిన వారి లిస్టు తమ ఫైటర్ల దగ్గర ఉందని, వారి కోసం వెతుకుతున్నారని చెబుతున్నారు. దీంతో నగరం నివురుగప్పిన నిప్పులా ఉంది.
వందలాది మహిళలు మిస్సింగ్
అఫ్గాన్ సైనికులు, తాలిబాన్ మిలిటెంట్లకు మధ్య జరిగిన యుద్ధం నుంచి తప్పించుకునేందుకు తమ గ్రామాల నుంచి పారిపోయి.. షహర్ ఏ నావ్ పార్క్‌‌లో ఆశ్రయం పొందిన వందలాది మహిళలు కనిపించకుండా పోయారు. ఢిల్లీలో ఉంటున్న అఫ్గాన్ సిటిజన్ నవేద్ ఈ విషయం వెల్లడించారు. ప్రావిన్సుల్లోని వేలాది మంది తమ పట్టణాలు, గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. చాలా మంది షహర్ ఏ నావ్ పార్క్‌‌లో వద్ద ఆశ్రయం షెల్టర్ పొందారు. ‘‘పార్కులో తలదాచుకున్న వందలాది మంది మహిళలు కనిపించకుండా పోయారు. వారి కోసం కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. కానీ ఎవరి ఆచూకీ చిక్కలేదు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌‌లో ఉన్న పరిస్థితి ఇది” అని నవేద్ చెప్పాడు. ఒక్క కుడుజ్‌‌లోనే 50 వేల మందికి పైగా తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారని తెలిపాడు.
కాబూల్ ఎయిర్‌‌‌‌పోర్ట్ ఓపెన్
కాబూల్ నుంచి బయటికి వెళ్లిపోయేందుకు ఏకైక మార్గమైన ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్టును రీఓపెన్ చేశారు. సైనిక తరలింపు విమానాల కోసం తెరవగా.. అమెరికన్ బలగాలు కాపలా కాస్తున్నాయి. మంగళవారం ఎయిర్‌‌‌‌పోర్టు ఖాళీగా కనిపించింది. వేలాది మంది ఎయిర్‌‌‌‌పోర్టులోకి రావడంతో సోమవారం అన్ని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాల్పులు, తొక్కిసలాట, విమానం నుంచి పడిపోయి కనీసం ఏడుగురు నుంచి 10 మంది చనిపోయారని అమెరికా అధికారులు చెప్పారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌‌‌‌పోర్టు నుంచి అమెరికా ఎంబసీ ఆఫీసు పని చేస్తోంది. అఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలనుకునే అమెరికన్లు ఆన్‌‌లైన్‌‌లో రిజిస్టర్ చేసుకోవాలని, తమకు కాంటాక్ట్ కాకుండా నేరుగా ఎయిర్‌‌‌‌పోర్టుకు రావద్దని సూచించింది.
అందరికీ క్షమాభిక్ష
అఫ్గాన్ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నా మని తాలిబాన్ కల్చరల్ కమిషన్ మెంబర్ ఎనముల్లా సమాంగని ప్రకటించారు. గత ప్రభుత్వంలోని రాజకీయ నేతలతో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగులంతా విధుల్లోకి రావాలని కోరారు. తమ ప్రభుత్వంలో చేరాలంటూ మహిళలకు పిలుపునిచ్చారు. ‘‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్.. పూర్తి గౌరవం, నిజాయితీతో ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతోంది. 40 ఏళ్లకుపైగా అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభంలో ప్రధాన బాధితులు మహిళలే. వాళ్లు ఇకపై ఎంతమాత్రమూ బాధితులుగా ఉండబోరు’’ అని ప్రకటించారు.
 ప్రజలందరూ దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటం, తాలిబాన్ల పాలన విషయంలో భయాందోళనల వ్యక్తమవుతుండటంతో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘మహిళలు చదువుకునేందుకు.. పని చేసుకునేందుకు.. షరియా లా ప్రకారం, మా కల్చర్ ప్రకారం ప్రభుత్వ విభాగాల్లో పని చేసేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు. అన్ని వర్గాలు ప్రభుత్వంలో చేరాలని పిలుపునిచ్చారు. 

తాలిబాన్లలో మార్పు?

మహిళలు చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేయొచ్చని వెల్లడి
భుత్వంలో భాగం కావాలని పిలుపు
అఫ్గానిస్తాన్​లో ఓ మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన తాలిబాన్​ నేత 


టోలో టీవీలో ఓ మహిళా యాంకర్.. తాలిబాన్ లీడర్‌‌‌‌ను ఇంటర్వ్యూ చేసింది!! తమను ప్రజా జీవితం నుంచి పక్కకి తప్పించొద్దంటూ కాబూల్‌లో కొందరు మహిళలు సైన్ బోర్డులు ప్రదర్శించారు!! తాలిబాన్ రాజ్యంలో ఓ మహిళ ఒంటిరిగా బయటికొస్తేనే నేరంగా భావిస్తారు. అలాంటిది టీవీలో కనిపించడం, నిరసన ప్రదర్శన చేయడం.. కొంత వింతే. అంతేనా.. ప్రజలు సాధారణ జీవితాన్ని పొందేందుకు అనువైన వాతావరణాన్ని అందిస్తామని తాలిబాన్లు చెబుతున్నారు. మహిళలు చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని, తమ ప్రభుత్వంలో భాగం కావచ్చని కూడా చెబుతున్నారు. గతంలో ప్రభుత్వంతో పని చేసిన వాళ్లు, విదేశాలకు సాయం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోబోమని అంటున్నారు. దీంతో తాలిబాన్లలో మార్పు వచ్చిందా? అని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ‘‘1990ల్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లు మదర్సాల్లో స్టూడెంట్లు. వాళ్లకు అప్పుడేం తెలియదు. 20 నుంచి 24 ఏండ్లలోపు వాళ్లే. ఇప్పుడు పరిస్థితి మారింది. వాళ్లు చర్చించడం, ప్రపంచ దేశాలకు కోఆపరేట్ చేయడం నేర్చుకున్నారు. అయితే వాళ్లు గత ప్రభుత్వం మాదిరి ఉదారవాదులు కాదు.. సంప్రదాయవాదులే’’ అని అఫ్గాన్ రీసెర్చర్, పొలిటికల్ అనలిస్ట్ ఇర్ఫాన్ యార్ అన్నారు. తాలిబాన్ల మాటలను స్థానిక అఫ్గాన్లే నమ్మడం లేదు. గతంలో మాదిరే వారి పాలనలో హింస, అణచివేత ఉంటుందేమోనని భయాందోళన చెందుతున్నారు. అఫ్గాన్ పేరును ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌‌గా మార్చడాన్ని వారు ఉదాహరణగా పేర్కొంటున్నారు. గతంలోనూ ఇలానే మార్చారని చెబుతున్నారు. 

తాలిబాన్ నేతలు, గత ప్రభుత్వ నేతల మధ్య మంగళవారం కూడా చర్చలు కొనసాగాయి. మాజీ ప్రెసిడెంట్ హమీద్ కర్జాయ్, అఫ్గాన్ నేషనల్ రీకాన్సిలియేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు అబ్దుల్లా అబ్దుల్లా ఈ డిస్కషన్స్‌‌లో పాల్గొన్నారు. ఎవరు, ఏ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తారో విభజించడమే కాకుండా.. గత 20 ఏళ్లలో అఫ్గనిస్తాన్‌‌లో వచ్చిన మార్పులను బట్టి తాలిబాన్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దానిపై చర్చలు జరిగాయి. ఇప్పటిదాకా ప్రభుత్వ మార్పిడి గురించి ఎలాంటి ప్రకటన జరగలేదు. మంగళవారం ట్వీట్ చేసిన ప్రస్తుత ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే .. ప్రెసిడెంట్ లేనప్పుడు వైస్ ప్రెసిడెంటే బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. ఏకాభిప్రాయం, మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మరోవైపు తాము తాలిబాన్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇండ్లకు వచ్చేయండి
దేశ ప్రజలందరికీ అభినందనలు. ఇది మనం గర్వించదగ్గ క్షణం. ఈ రోజు మన చట్టపరమైన హక్కును సాధించాం. మనం ఏ దేశంతోనూ మళ్లీ యుద్ధం చేయాలని అనుకోవడం లేదు. షరియా లా ప్రకారం మహిళలకు హక్కులు కల్పిస్తాం. అందరినీ క్షమించాం. ఎవరి ఇళ్లలోనూ సెర్చ్ చేయం. కాబూల్ ఎయిర్‌‌‌‌పోర్టులో ఉన్న ప్రజలారా మీరు సురక్షితంగా ఉన్నారు. భయపడకండి. ఇండ్లకు వచ్చేయండి. 
‑ జబీవుల్లా ముజాహిద్, తాలిబాన్ ప్రతినిధి
మా వాళ్లెందుకు ప్రాణత్యాగం చేస్తరు
యుద్ధం చేయకుండానే అఫ్గాన్‌ మిలటరీ సరెండర్‌ అయిపోయింది. వాళ్లే ఫైట్​ చేయనప్పుడు అమెరికా సైనికులు ఎలా ప్రాణ త్యాగాలు చేస్తారు?. ఇంకో 20 ఏండ్లు అమెరికా సైనికులు అఫ్గాన్‌లో ఉన్నా లాభం లేదు. అఫ్గాన్‌లో రూ.74 లక్షల కోట్లు ఖర్చు చేశాం. వాళ్ల ఫ్యూచర్‌  మార్చుకునే అవకాశం ఇచ్చినా ఉపయోగిం చుకోలేదు. మా సైనిక బలగాల ఉపసంహరణ సరైన నిర్ణయమే. ‑ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌