- ఫేక్ డాక్యుమెంట్లతో 2002లో ఎస్‌బీఐ నుంచి రూ.50 లక్షలు మింగిన కంప్యూటర్ ఆపరేటర్
- కేసు నమోదు కావడంతో పరార్
- పలు రాష్ట్రాల్లో స్వామీజీగా అవతారం
- ఎట్టకేలకు తమిళనాడులో అరెస్టు
హైదరాబాద్, వెలుగు: ఎస్‌బీఐ బ్యాంకు నుంచి రూ.50 లక్షలు కాజేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను 22 ఏండ్ల తర్వాత సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పేర్లు, ఊర్లు మారుస్తూ తిరుగుతున్న నిందితుడు చలపతిరావును తమిళనాడు తిరునెల్వేలి జిల్లా నర్సింగ నల్లూర్‌లో ఆదివారం పట్టుకున్నారు. హైదరాబాద్ కు తరలించి సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. చందులాల్ బారాదరీ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చలపతిరావు పనిచేసేవాడు.
2002లో తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రూ.50 లక్షల లోన్ తీసుకుని బ్యాంకును మోసగించాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో 2002 మే నెలలో చలపతిరావు, ఆయన భార్యపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. చలపతి రావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత అతను బెయిల్ పై బయటకు వచ్చి 2004లో పరారయ్యాడు.
డెత్ సర్టిఫికెట్ కోసం కోర్టును మోసం చేసిన భార్య
చలపతిరావు అదృశ్యమయ్యాడంటూ ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న చలపతిరావు భార్య అదే ఏడాది కామటిపుర ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఏడేండ్లు గడిచినప్పటికీ చలపతి జాడ తెలియలేదు. ఇదే అదునుగా తన భర్త చనిపోయినట్టుగా ధ్రువీకరించాలని సిటీ సివిల్ కోర్టులో భార్య పిటిషన్ వేసింది. విచారణ జరిపిన అనంతరం చలపతి గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పాటు అతని భార్య అందించిన వివరాల ఆధారంగా చలపతిరావు చనిపోయాడని నిర్ధారిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
పేరు,ఊరు మార్చుతూ తప్పించుకు తిరిగాడు
హైదరాబాద్ నుంచి పారిపోయిన చలపతిరావు 22 ఏండ్ల పాటు పేరు, ఊరు మార్చుకుంటూ సీబీఐకి చిక్కకుండా తప్పించుకున్నాడు. 2007లో తన పేరు వినీత్ కుమార్‌గా మార్చుకుని తమిళనాడులోని సేలంలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ, ఇటీవల చలపతిరావు రెండో భార్యను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను మళ్లీ పారిపోయాడు. భోపాల్ కు మకాం మార్చాడు. తర్వాత ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌కు వెళ్లాడు.
స్వామీజీగా అవతారం
ఉత్తరాఖండ్ లో పోలీసులు తన కోసం గాలిస్తున్నట్లు తెలియడంతో చలపతిరావు.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు పారిపోయాడు. అక్కడ స్వామి విదితాత్మానంద తీర్థగా పేరు మార్చుకుని ఓ ఆశ్రమంలో చేరాడు. 2021లో ఆశ్రమం నుంచి రూ.70 లక్షలు చోరీచేసి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు పరారయ్యాడు. అక్కడ స్వామి విదితాత్మానంద తీర్థగానే కొనసాగుతూ ఒక శిష్యురాలిని తీసుకుని మళ్లీ తమిళనాడులోని తిరునెల్వేలికి చేరుకున్నాడు. అక్కడ కూడా విదితాత్మానందగానే చెలామణి అయ్యాడు. చివరకు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా నర్సింగ నల్లూర్‌లో ఆదివారం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
