తెరుచుకున్న ఏడుపాయల ఆలయం ..28 రోజుల తర్వాత అమ్మవారి దర్శనం

 తెరుచుకున్న ఏడుపాయల ఆలయం ..28 రోజుల తర్వాత అమ్మవారి దర్శనం

పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయం 28 రోజుల తర్వాత తెరుచుకుంది. భారీ వర్షాలకు తోడు సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్‌‌ నుంచి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో వనదుర్గా భవానీమాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 

అమ్మవారి ఆలయ మండపం పైకప్పును తాకుతూ వరద ప్రవాహం కొనసాగింది. దీంతో ఇన్నాళ్లూ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంపై ఉంచి పూజలు నిర్వహించారు. ప్రస్తుతం వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో గురువారం ఆలయాన్ని తెరిచిన అర్చకులు సంప్రోక్షణ చేసిన అనంతరం అమ్మవారి విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు.