
రాజకీయాల్లో మాటల యుద్ధాలు ముగిసేది చేతలతోనో, వాటి ఫలితాలతోనో! తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల నడుమ మాటల యుద్ధం ఇప్పుడు తీవ్రస్థాయిలో ఉంది. ‘ములుకోలతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేనొకటిస్తా’ అన్న చందంగా ఇది సాగుతోంది. రెండు, మూడు నెలల్లో వస్తాయంటున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికలో ఎవరి సత్తా ఏమిటి అనేది తేలాల్సి ఉంది. ఏ లెక్కన చూసినా రాబోయే ఈ ఎన్నికలు పాలకపక్షం కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయంగా సవాల్ వంటివే. విమర్శ, ప్రతివిమర్శ కోసం గొంతెత్తి వినిపిస్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో వారి సత్తా, సత్తువకున్న పొంతనను ఈ ఎన్నికలు కచ్చితంగా నిర్ధారిస్తాయి.
రాష్ట్రం ఏర్పడ్డ నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, రేపు అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ.. ఈ మూడు పార్టీలకు ఎన్నికలు కొత్తకాదు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరిసగం..ఎనిమిదేసి స్థానాలు గెలుచుకున్న తర్వాత వచ్చే ఏ ఎన్నికైనా ఆసక్తి కలిగించేదే. ముఖ్యంగా, ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయపార్టీగా మారిన బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.
అసెంబ్లీ, లోక్‌సభ రెండు ఎన్నికల్లో వరుస ఓటమి తర్వాత వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు అగ్నిపరీక్షవంటివే. భవిష్యత్ రాజకీయ స్థితిని పదిలపరుచుకోవాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో తన ప్రభావం చూపించి, పార్టీ క్యాడర్‌ను నిలబెట్టుకోవడం మిగతా రెండు పార్టీలకన్నా వారికే ఎక్కువ అవసరం. ఇప్పటివరకు జరిగిన ఏకైక ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పాలక కాంగ్రెస్పక్షానికి కోల్పోయింది. బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో రేపు జరగాల్సిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా వారికి పరీక్ష కానుంది.
మూడు పార్టీలకూ సవాలే
జూబ్లీహిల్స్అసెంబ్లీ స్థానానికి 6 మాసాల్లో ఉప ఎన్నిక ఎప్పుడైనా జరగవచ్చు. సంవత్సరాంతంలో జరగాల్సిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటుగాని, అంతకుముందేగాని ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక జరిపించవచ్చు. ఎన్నిక ఎప్పుడు జరిగినా గెలుపు మూడు ప్రధాన పక్షాలకూ అత్యవసరం. కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్వరూపం, గత చరిత్ర, మూడు పార్టీల ప్రస్తుత పరిస్థితిపరంగా చూసినప్పుడు గెలుపు ముగ్గురుకీ సవాల్‌గానే కనిపిస్తోంది.
2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్. మూడోవంతు ముస్లిం ఓటర్లతో ఉండే అర్బన్ స్థానమిది. 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు పి. జనార్దన్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మారి 2018, 2023 వరుస ఎన్నికల్లో గెలిచారు. ఈ అసెంబ్లీ స్థానం సికింద్రాబాద్లోక్సభ స్థానం పరిధిలోనిది.
మైనారిటీల ప్రభావం
2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా 2014, 2018 వరుస ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో పార్టీ ఆయనకు టికెట్టు నిరాకరించి క్రికెటర్ అజహరుద్దీన్‌కు ఇచ్చింది. విష్ణు పార్టీ మారి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ ఎన్నికల్లో విజేత గోపీనాథ్(బీఆర్ఎస్) 43.94 శాతం ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి 35.03 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇక్కడ తన ఓటుశాతాన్ని 50.83కు పెంచుకోగలిగింది. అధికంగా ముస్లిం ఓట్లున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జరిగే ముక్కోణపు పోటీని పాలకపక్షం తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలు ఉంటాయన్నది ఒక అభిప్రాయం. ‘కులగణన’తో పాటు, ‘సామాజిక న్యాయం’ ప్రచారం కాంగ్రెస్‌కు లాభించవచ్చు.
కేంద్ర మంత్రికీ సవాలే
రాజధాని నగరంలో అప్పుడప్పుడు తమ సంప్రదాయ గెలుపు స్థానాల్లో తప్ప కొత్త ప్రాంతాలకు విస్తరించడం లేదనే విమర్శ బీజేపీ మీద ఉన్నది. దాన్ని తొలగించుకోవడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక చక్కని అవకాశం. పైగా ఈ స్థానం కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2014లో గెలిచిన బండారు దత్తాత్రేయ మోదీ తొలి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2019, 2024లో గెలిచిన కిషన్‌రెడ్డి రెండు పర్యాయాలు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానంలో 14.11 శాతం ఓట్లు (దీపక్‌రెడ్డి) వచ్చాయి. వెనువెంటనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో బీజేపీ ఓటుషేర్ అమాంతం 36.64 శాతానికి పెరిగింది. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రంలో పార్టీ విస్తరణ, తదుపరి అధికారం కైవసం చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నందున ఈ ఉప ఎన్నిక బీజేపీకి ప్రతిష్టాత్మకం కానుంది.
బీజేపీకి అంతర్గత సవాళ్లు
2023 అసెంబ్లీ ఎన్నికల ముందర వచ్చిన ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమి బీజేపీని కుంగదీసింది. ఇలాంటి పరిణామాలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అవకాశాలను బాగా దెబ్బతీశాయి. ఈలోగా పార్టీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడొస్తే అతనికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సవాల్గా నిలుస్తుంది. ఇంకా కిషన్‌రెడ్డి నాయకత్వమే కొనసాగితే.. ఎమ్మెల్యే రాజాసింగ్, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్వంటి వారు పరోక్షంగానైనా జూబ్లీహిల్స్ స్థానం గెలుచుకొని రండని పార్టీలో అంతర్గతంగా సవాల్ విసిరే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశమే వస్తే తాము తమ పరిధిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించుకోవడాన్ని బండి సంజయ్ వర్గీయులు ప్రస్తావించవచ్చు.
వారికి ఇది విషమ పరీక్ష
ఎన్నికల్లో వరుస ఓటములతో సతమతం అవుతున్న బీఆర్ఎస్కు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా, జూబ్లీహిల్స్ఉప ఎన్నిక ఒకరకంగా విషమ పరీక్షే. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవడం ముఖ్యం. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అవకాశం. సాధారణంగా స్థానిక ఎన్నికలు పాలక పక్షానికి అనుకూలంగా ఉంటాయని ఒక వాదన ఉన్నా.. బీఆర్ఎస్వంటి విపక్ష పార్టీకి ఒక అవకాశమే. కానీ, 2023, 2024, కంటోన్మెంట్ ఉప ఎన్నిక వరుస ఓటముల తర్వాత వచ్చే స్థానిక ఎన్నికలు చాలా కీలకం.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా తమ సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మృతితో వస్తున్నది. రాజధాని నగర పాలక సంస్థ చేతిలో ఉన్న పార్టీగా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్కు సవాలే. 2023లో ఇక్కడ సాధించిన ఓటు వాటా 43.94 నుంచి 2024 లోక్‌సభ నాటికి అది 10.42 శాతానికి పడిపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ముక్కోణపు పోటీగా మారే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాటికి ఏ పార్టీ ఎవరిని తమ అభ్యర్థిగా నిలుపుతుందన్నది కీలకం. అభ్యర్థులు సరైనవారు లేకుంటే.. అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత ఒకటి గుర్తుకు రావడం ఖాయం. ‘సారీ.. ఈ నియోజకవర్గంలో..మిమ్మల్ని కలవడం.. మొట్టమొదటిసారి.. కానీ, మిమ్మల్ని గాఢంగా ప్రేమించడం.. ఇది మూడోసారి!’
సవాల్గా తీసుకుంటేనే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పాలక కాంగ్రెస్ పార్టీకి క్లిష్టమైనా.. అది ఒక చక్కని అవకాశం. 2023 ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి రాజధాని నగరం, శివారుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా దక్కలేదు. తర్వాతి ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం దక్కినా.. దాన్ని కలుపుకొని ఉన్న పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి. అప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానం బీజేపీ గెలుచుకోవడంతో ఆ వెల్లువలో కొట్టుకుపోయింది. జూబ్లీహిల్స్ గెలుపుతో రాజధానిలో మరో అసెంబ్లీ స్థానం గెలుచుకున్న ఘనత పాలక పక్షానికి దక్కుతుంది. రాష్ట్రం ఏర్పడ్డ నుంచి పార్టీని ఊరిస్తున్న సంపన్నులు ఉండే నియోజకవర్గం ‘చేతి’కి అందినట్టవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, పార్టీ నాయకత్వానికి ఇది ఒక రకంగా సవాల్ వంటిదే.
దిలీప్‌రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ